ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో ఇటీవల వందలాది మంది అస్వస్థతకు గురై ఉన్నట్టుండి కుప్పకూలటం చూశాం. వారి రక్తంలో సీసం, పాదరసం తదితర రసాయనాలు మోతాదుకు మించి ఉన్నట్లు తేలింది. అవి ఒంట్లోకు ఎలా చేరాయో తెలియలేదు. మనం తినే ఆహారోత్పత్తుల వల్ల పురుగు మందుల అవశేషాలు మన శరీరంలోకి చేరి అంతుచిక్కని రోగాలకు కారణమవుతున్నాయి. ఈ విషయాన్ని పదేళ్ల కిందటే గ్రహించిన నిజామాబాద్ జిల్లా రైతు... పాత తరం వరి వంగడాలతో సేంద్రీయ సేద్యం చేస్తున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా రైతు నేస్తం పురష్కారం అందుకున్న ఆదర్శ రైతుపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
సేంద్రియంపై మొగ్గు ఇలా...
నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం చింతలూరుకు చెందిన నాగుల చిన్న గంగారాం ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. స్థానికంగా ఆయనని చిన్ని కృష్ణుడిగా పిలుస్తారు. ఓ యోగా గురువు సూచనతో సేంద్రియ వ్యవసాయంపై మొగ్గు చూపారు. ఆరో తరగతి చదివిన ఆయన పదేళ్ల క్రితం వరకు సాధారణ రైతే. అనారోగ్య సమస్యలతో ఆయన యోగా శిక్షణకు వెళ్లిన చోట సేంద్రీయ ఆహార ఉత్పత్తులను తెలుసుకున్నారు.