God Roof Garden: ఆధ్యాత్మిక చింతన, మానవ శ్రేయస్సు కోసం నిరంతరం పరితపించే బ్రహ్మకుమారీలు.. ప్రకృతి గొప్పతనం, పర్యావరణహితాన్ని ప్రజలకు వివరిస్తూ స్ఫూర్తిదాతలుగా నిలుస్తున్నారు. నిజామాబాద్‌లోని హమాల్‌వాడీలో ఉన్న బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వీరి కృషికి నిదర్శనంగా నిలుస్తోంది. నిత్యం వందల మంది ధ్యానం చేసే ఈ కేంద్రాన్ని లాక్‌డౌన్ సమయంలో మూసివేశారు. ఖాళీ సమయంలో పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించిన బ్రహ్మకుమారీలు.. ధ్యానకేంద్రం మిద్దెపై మొక్కల పెంపకానికి బీజం వేశారు. మొదట ఒకట్రెండు మొక్కలకు నిలయమైన ఈ గాడ్ గార్డెన్.... ప్రస్తుతం హరితక్షేత్రంగా మారిపోయింది.
వివిధ రకాల పూల చెట్లు
సాధారణంగా అందరూ పెంచే మొక్కలనే కాకుండా పూర్వకాలంనాటి రకాలను బ్రహ్మకుమారీలు ధ్యాన కేంద్రం మిద్దెపై పెంచుతున్నారు. ఈ బంగ్లాపై డాలియాస్, పిటోనియో, సింహాచలం సంపెంగ, నైట్ క్వీన్, జీనియా, బ్రహ్మకమలం, ప్రపంచ 7 వింతలను పోల్చే కమల పుష్పాలు, స్పైడర్ లిల్లీ, పారిజాతం, 7 రకాల జాస్మిన్, పీస్ లిల్లీ, ఎడారి పుష్పం, కాస్మోస్ ఫ్లవర్స్, అలమంద ఇలా ప్రకృతి ప్రేమికులకు సైతం తెలియని 250 రకాలకు పైగా మొక్కలు కొలువుదీరాయి. కేవలం పూలరకాలే కాకుండా పండ్ల మొక్కలు, కూరగాయాలు, ఇతర ఔషధ జాతులకు నిలయంగా మారింది.
సేంద్రీయ సాగు
"కరోనా సమయంలో ధ్యానకేంద్రం మూతపడింది. దీంతో సాయం లేకపోవడంతో మిద్దెపై ఆకుకూరలు సాగుచేశాం. ఆ తర్వాత మిరప, టమాట ఇలా వివిధ రకాల కూరగాయలు సాగు చేసుకుంటూ వచ్చాం. కూరగాయల సాగుకు సంబంధించి వివిధ రకాల వీడియోలు చూసి అవగాహన పెంచుకున్నాం. విభిన్న రకాల పండ్ల చెట్లు పెట్టాం. ఇప్పటి వరకు మా మిద్దెపై 750 కుండీలు ఉన్నాయి. కేవలం సేంద్రీయ ఎరువులతోనే మొక్కలను పోషిస్తున్నాం. మిగిలిన కూరలు, అన్నం, వ్యర్థాలనే మొక్కలకు ఎరువులుగా వేస్తున్నాం. కొన్ని మొక్కల ఔషధాలతో వివిధ రకాల రోగాలను నయం చేస్తున్నాం. కూరగాయలు, ఆకుకూరలను కాలనీవాసులకు పంచుతున్నాం."
-సునీతా బెహన్‌జీ, బ్రహ్మకుమారీ