రోడ్లన్నీ గుంతలు... ప్రయాణికుల ఇక్కట్లు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 44వ జాతీయ రహదారి విస్తరణ పనులు 2012-13లో చేపట్టారు. దీని వెంబడి ఉన్న గ్రామ ప్రజల సౌకర్యార్థం సర్వీసు రోడ్లు నిర్మించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో పైపులైన్లు వేయడానికి 2017లో వీటిని తవ్వి మట్టితో పూడ్చారు. మూడేళ్లు కావస్తున్నా పునరుద్ధరణకు నోచుకోవటం లేదు. ఫలితంగా చిన్నపాటి వర్షాలకు పెద్ద గుంతలు ఏర్పడి రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ రోడ్డులో వెళ్లాలంటే వాహనదారులు జంకుతున్నారు. తప్పని పరిస్థితుల్లో వెళ్లే వారు గుంతల్లో వాహనాలు ఇరుక్కొని ప్రమాదాల బారిన పడుతున్నారు. అయినా నిర్వాహకులు చోద్యం చూస్తున్నారు.
అనేకసార్లు ప్రమాదాలు
స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఇందల్‌వాయి మండల కేంద్రంలోని సర్వీస్ రోడ్డులో 50 నుంచి 60మందితో వెళ్లే ఆర్టీసీ బస్సు గుంతలో దిగబడిపోయి ఓ పక్కకు ఒరిగింది. అదృష్టవశాత్తూ ఎవరికి గాయాలు కాలేదు. గతంలోనూ సిలిండర్ల లారీ గుంతలో దిగబడిపోయి ఒరిగిపోవడంతో స్థానికులు ఆందోళన చెందారు. ఆటోలు, ద్విచక్రవాహనాలు అనేకసార్లు గుంతల్లో పడి ప్రమాదాలు జరిగాయి.
అధికారుల సమన్వయలోపం
ఉమ్మడి జిల్లాలో 59 సర్వీస్ రోడ్లు ఉన్నాయి. వాటిలో 29 మాత్రమే తారురోడ్లుగా మర్చారు. మిగిలినవి మట్టితో, కంకర తేలి అధ్వానంగా ఉన్నాయి. తారు వేసిన రోడ్లు మిషన్ భగీరథ కోసం తవ్వి మట్టితో పూడ్చటం వల్ల గుంతల మయంగా మారాయి. సదాశివనగర్, పద్మాజివాడి, దగ్గి, చంద్రాయన్‌పల్లి, ఇందల్‌వాయి, బీబీపూర్‌తండా, డిచ్‌పల్లి బెటాలియన్, నడిపల్లి తండా, సుద్దపల్లి, బాలానగర్, సికింద్రాపూర్, పడకల్, జక్రాన్‌పల్లితండా, జక్రాన్‌పల్లి, అర్గుల్ ప్రాంతాల్లో వాహనాల రద్దీ దృష్ట్యా మొత్తం 18.33 కిమీ సర్వీసు రోడ్డు నిర్మించారు. మిషన్ భగీరథలో ధ్వంసమైన రోడ్డును పునరుద్ధరించడంలో మిషన్ భగీరథ, టోల్‌ప్లాజా అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టమవుతోంది.
ఎవరు చేయాలి!
వాస్తవానికి జాతీయ రహదారుల నిర్వహణ బాధ్యత టోల్ వసూలు చేస్తున్న ఆయా సంస్థలకే ఉంటుంది. కానీ అభివృద్ధి పనుల కోసం రోడ్డు ధ్వంసం చేసినందుకు మిషన్ భగీరథ అధికారులు నష్టపరిహారం చెల్లించాలని చెబుతున్నారు. జరిగిన నష్టంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని మిషన్ భగీరథ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇరుశాఖల నిర్లక్ష్యంతో ప్రయాణికులు మూడేళ్లుగా నరకం చూస్తున్నారు. సర్వీసురోడ్లు గుంతలమయంగా మారడం వల్ల ఏడాది నుంచి ఎక్స్‌ప్రెస్ బస్సులు ఇందల్‌వాయి బస్టాండ్‌కు రావడం లేదని స్థానికులు వాపోతున్నారు. రోడ్లు బురదమయం కావడం వల్ల వ్యాపారాలు నడవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టోల్‌ప్లాజా నిర్వహకులు టోల్ వసూలు చేస్తున్నందున.. ప్రయాణికులకు అత్యుత్తమ సేవలు కల్పించాల్సి ఉంది. ఇప్పటికైనా సర్వీస్‌రోడ్లు పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: ఆటో ఢీకొని చిన్నారి మృతి, ఏడుగురికి గాయాలు