నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ శివారులోని చెక్కీ క్యాంపులో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 44కు చేరింది. పది రోజుల కిందట జరిగిన వివాహ వేడుకకు వెళ్లిన వారిలో వైరస్ ప్రభావిత బాధితుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. నూతన వధూవరులతో పాటు వారి బంధువర్గం, సన్నిహితులు వైరస్‌కు గురయ్యారు. వేడుకను చిత్రీకరించడానికి వెళ్లిన ఫొటోగ్రాఫర్ ఆయన కుమారుడు సోమవారం పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ ఫలితం వచ్చింది. పెళ్లితో సంబంధం ఉన్న వారు పట్టణం, సాలూర తదితర ప్రాంతాల్లో పరీక్షలు చేయించుకున్నారు.
కరోనా పంజా:నాలుగు వీధుల్లో 44 పాజిటివ్ కేసులు
పది రోజుల కిందట జరిగిన ఓ వివాహ వేడుక ఇప్పుడు ఆ పట్టణ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. నాలుగు వీధుల్లోనే ఏకంగా 44 కేసులు నమోదు కావటం వల్ల స్థానికులు భయపడుతున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో చోటుచేసుకుంది.
వివాహానికి హాజరైన వారి సమాచార సేకరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారు ఏ ప్రాంతానికి చెందిన వారో తెలుసుకొని అక్కడి వైద్య శాఖ యంత్రాంగం ద్వారా పరీక్షలు చేయించాలని అధికారులు యోచిస్తున్నారు. గరిష్ఠంగా 700 జనాభా, నాలుగు మాత్రమే వీధులున్న ప్రాంతంలో పాజిటివ్ కేసులు 40 దాటడం అధికారులను కలవరానికి గురిచేసింది. బల్దియా పరిధిలో ఇటీవల విలీనమైన ఈ శివారు ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వైరస్ కేసుల సంఖ్య విస్తరించకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చిస్తున్నారు. వైరస్ కేసుల దృష్ట్యా సర్కారు క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది.
పరీక్షలకు ఎమ్మెల్యే ఏర్పాట్లు
వివాహ వేడుక కారణంగా వైరస్ కేసులు నమోదు కావడంపై ఎమ్మెల్యే షకీల్ స్పందించారు. కొవిడ్ పరీక్షల నిర్వహణ కోసం ఆయన సొంత ఖర్చుతో అంబులెన్సును సమకూర్చారు. దానిని మంగళవారం పంపుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తారు. విలీన ప్రాంతం మొన్నటి వరకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉండేది. బల్దియాలో కలవడంతో పట్టణంలో చేరింది. అధికారికంగా ఈ ప్రాంతం ప్రస్తుతం ఏ ఆస్పత్రి పరిధిలో ఉందనే విషయంపై స్పష్టత లేదు.