గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర గిరిజన సహకార సంస్థ(టీఎస్‌జీసీసీ) ఆధ్యర్యంలో రూ. కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన సబ్బుల తయారీ పరిశ్రమను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.
పరిశ్రమల స్థాపనతో గిరిజనులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని మంత్రి అన్నారు. గిరిజన మహిళలకు మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. గిరిజన సహకార సంస్థ ద్వారా గిరిజనులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అటవీ ఉత్పత్తులను సేకరించడమే కాకుండా గిరిజనులతోనే ప్రాసెసింగ్ యూనిట్లు నిర్వహించి వారి ద్వారానే మార్కెటింగ్ చేయించి వచ్చే ఆదాయాన్ని వారికే చెందేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. తద్వారా గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.