ACCIDENTS ON NH 65: తెలుగు రాష్ట్రాలకు వారధిగా ఉంటూ... నిత్యం అత్యంత రద్దీగా ఉండే రహదారుల్లో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిని ప్రధానంగా చెప్పవచ్చు. ఈ రహదారిపై నిత్యం రోడ్డు ప్రమాదాలు జరగటం, ప్రజలు చనిపోవటం సర్వసాధారణంగా మారింది. అతివేగం, రోడ్డు విస్తరణలాంటి కారణాలెన్నీ ఉన్నా... రోడ్డుపక్కన అడ్డగోలుగా పార్కింగ్ చేస్తూ ఎంతో మంది ప్రాణాలు పోవటానికి కారణమవుతున్నారు. జాతీయ నేర గణాంక విభాగం-ఎన్సీఆర్బీ ప్రకారం ఆగి ఉన్న వాహనాలను ఢీకొట్టి... ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ఈ రహదారిపై సగటున రోజుకు ఇద్దరు ప్రయాణీకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.
ఎన్‌హెచ్-65తో పాటూ... హైదరాబాద్ - వరంగల్ రహదారిలోనూ ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఇటీవల ఆలేరు పట్టణ శివారులో రహదారిపై ఆగి ఉన్న ట్రాక్టర్‌ను బస్సు ఢీకొట్టిన ఘటనలో నలుగురు కూలీలు మృతిచెందారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఒక్క హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి పైనే 172 ప్రమాదాలు జరగ్గా.. 84 మంది వాహనదారులు మృత్యువాత పడటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. లారీలను ఇష్టానుసారంగా రహదారి పక్కనే నిలుపుతుండటం వీటికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. రహదారి పక్కన పార్కింగ్‌ను నియంత్రించాల్సిన పెట్రోలింగ్ అధికారులు పట్టించుకోకపోవడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ-ఎన్హెచ్ఏఐ అధికారులతో పాటూ స్థానిక పోలీసు యంత్రాంగాలు జాతీయ రహదారిపై సరైన పెట్రోలింగ్ చేయటంలేదు. భారీ సరుకు రవాణా వాహనాలు ఎక్కడికక్కడ రహదారి పక్కన నిలుపుతున్నారు.