కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ నేపథ్యంలో ఉమ్మడి నల్లొండ జిల్లాలోని దాదాపు 90 శాతం ప్రజలంతా ఇళ్లలోనే ఉంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికీ సొంతిళ్లు ఉన్నవారు కేవలం 25 శాతం మందే. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఉమ్మడి జిల్లాలో 11.02 లక్షల కుటుంబాలు ఉండగా.. అందులో సగం అంటే 5.1 లక్షల కుటుంబాలు ఒక్క గదిలోనే నివాసం ఉంటున్నాయి. కరోనా వైరస్ అంటువ్యాధి కావడంతో ఇంటిలోని ఒకరు అనారోగ్యం బారిన పడితే ఆ కుటుంబం అంతా దానికి బాధితులు కావాల్సిందే.
ప్రస్తుతం కుటుంబంలో ఒకరికి జలుబు, దగ్గు వస్తే వారి నుంచి ఇతరులకు అంటుకోకుండా నివారించాలంటే అవి సోకిన వారిని ప్రత్యేక గదిలో వేరుగా ఉంచాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అవకాశం ఉన్న కుటుంబాలు ఉమ్మడి జిల్లాలో కేవలం 50 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. 7.5 లక్షల కుటుంబాల్లో ముగ్గురు కంటే ఎక్కువ జనాభా ఉన్నారు.
కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ వేళ ప్రతి కుటుంబం తప్పనిసరిగా ప్రభుత్వ ఆదేశాలు పాటించి ఇంట్లోనే ఉండి... కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు వస్తే వెంటనే వైద్యులకు తెలపాలని అధికారులు సూచిస్తున్నారు.