రాష్ట్రంలోని ప్రజల సమస్యల కోసం ఉన్నత ఉద్యోగానికి రాజీనామా చేయడం ఆనందంగా ఉందని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ అన్నారు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలో బుధవారం ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బహుజనులకే రాజ్యాధికారం రావాలని చెప్పారు. ఈ నెల 8న నల్గొండలో బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించే సభ దేశ చరిత్రలో నిలవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో మాయావతి ప్రధాని అవడానికి ఈ సభ సంకేతం కావాలని ఆశించారు.
ప్రలోభాలకు గురి కావద్దు
70 ఏళ్లుగా బహుజనులు అణచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా మేల్కొందామని కార్యకర్తలకు స్పష్టం చేశారు. తెలంగాణలో పెత్తందారీతనం పోవాలంటే బహుజనులకే రాజ్యాధికారం రావాలని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయంలో డబ్బు వంటి ప్రలోభాలకు లొంగవద్దని కోరారు.