munugode by election: అసెంబ్లీ ఎన్నికల ముందు జరుగుతున్న మునుగోడు ఉపఎన్నికలో గెలవాలనే లక్ష్యంతో ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. గాంధీభవన్‌లో మునుగోడు వ్యూహంపై మూడు గంటలకుపైగా కాంగ్రెస్ సమావేశం నిర్వహించింది. మహిళా అభ్యర్థికి అవకాశమిచ్చామన్న విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.
నమ్మకానికి, అమ్మకానికి మధ్య జరుగుతున్న యుద్ధం: నమ్మకానికి, అమ్మకానికి మధ్య జరుగుతున్న యుద్ధమంటూ బలంగా జనంలోకి తీసుకెళ్లాలని తీర్మానించారు. ఈ నెల 11న తొలిసారి పాల్వాయి స్రవంతి నామినేషన్ వేయాలని 14న భారీ జనసమీకరణతో మరో సారి నామపత్రాలు దాఖలు చేయాలని నిర్ణయించారు. 9 నుంచి 14 వరకు రేవంత్‌తో సహా ఇన్‌ఛార్జ్ నేతలంతా అక్కడే మకాం వేయాలని నేతలు స్పష్టం చేశారు. సమీక్షా సమావేశంలో నియోజకవర్గంలో ప్రచార సరళిపై చర్చించామని రెండు రోజుల్లో మరో సమీక్ష ఉంటుందని పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారంలో పాల్గొంటారని ఆమె పేర్కొన్నారు.