తెలంగాణ

telangana

ETV Bharat / state

పల్లె బతుకులు ఆగం.. కరోనా పరీక్షలు చేయక వేగంగా వ్యాప్తి!

గ్రామాలపై కొవిడ్‌ పంజా విసురుతోంది. పల్లె వాసుల్లో అవగాహన తక్కువగా ఉండటం, పరీక్షలు చేయించు కోకపోవటం వైరస్‌ వ్యాప్తికి కారణమవుతోంది. ఆటోలు, జీపుల్లో కిక్కిరిసి ప్రయాణించడమూ ఒక కారణమే. కొందరు ఆర్‌ఎంపీల వద్దకు వెళ్తున్నారు. మరికొందరు తెలిసిన మందులు వేసుకుంటున్నారు. ఫలితంగా చికిత్స ఆలస్యమై వ్యాప్తి పెరుగుతోంది.

corona tests in telangana villages
తెలంగాణ గ్రామాల్లో పెరుగుతున్న కరోనా పాజిటివిటీ రేటు

By

Published : May 24, 2021, 5:31 AM IST

పల్లెలపై మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ పల్లె బతుకులను ఆగం చేస్తోంది. కొవిడ్ అలజడి వల్ల ఇరుగు పొరుగు వారితో ముచ్చట్లు బంద్‌ కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పలు జిల్లాల్లో పాజిటివిటీ రేటు భారీగా పెరిగింది. కరోనా నిర్ధారణ పరీక్షలు తగ్గగా అనుమానితులు అంతకంతకూ పెరిగిపోతున్నారు. అధికారికంగా నమోదవుతున్న కేసులే కాకుండా.. కరోనా లక్షణాలు ఉన్నవాళ్లు పెద్దసంఖ్యలో ఉంటున్నారు.

ఇంటింటి సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా... మూడున్నర లక్షల మందికి కొవిడ్‌ లక్షణాలు ఉన్నట్లు వెల్లడైంది. వైరస్‌ సోకితే పక్కవారు ఏమనుకుంటారోనని పల్లెల్లో చెప్పడంలేదని ఇంటింటి సర్వే నిర్వహించిన ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు చెబుతున్నారు.

అల్లాడుతున్న నాగర్​కర్నూర్​..

చుట్టూ నల్లమల అడవులు.. ఎక్కువగా పల్లె ప్రాంతాలున్న నాగర్‌కర్నూల్‌ జిల్లా కొవిడ్‌తో అల్లాడుతోంది. ఇక్కడ ప్రతి 100 మందిలో 13 మందికి వ్యాధి నిర్ధారణ అవుతోంది. 5 వారాల్లోనే కేసులు 15 రెట్లు పెరిగాయి. జిల్లాలో ఏప్రిల్‌ తొలి వారంలో 0.85 శాతం పాజిటివిటీ రేటు ఉంటే..... మే 8-12 వరకు 12.88 శాతం కేసులు బయటపడ్డాయి.

ఐదు వారాల్లో నాలుగింతలకు..

మంచిర్యాల జిల్లాలో ప్రతి 100 మందిలో 13 మందికి పాజిటివ్ వస్తోంది. పాజిటివ్‌ రేటు ఐదు వారాల్లో నాలుగింతలకు పెరిగింది. నల్గొండ జిల్లాలో ఏప్రిల్‌ తొలి వారంలో..... పాజిటివ్‌ రేటు 1.44% ఉండగా... మే రెండో వారంలో 10.10 శాతానికి.. అంటే 7 రెట్లు పెరిగింది. నల్గొండ జిల్లా హాలియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 40.8శాతం పాజిటివ్‌ రేటు నమోదైంది.

తల్లడిల్లుతున్న గిరిజనులు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని ఆదివాసీ గ్రామం శంభునిగూడెంలో నెలరోజుల వ్యవధిలో ముగ్గురు ప్రాణాలు వదిలారు. ఆ గ్రామజనాభా దాదాపు 600. ప్రస్తుతం 20కిపైగా కరోనా కేసులు ఉన్నాయి. పల్లెలో 350 మంది జ్వరాలతో విలవిల్లాడుతున్నారని గ్రామస్థులు తెలిపారు. పడుగోనిగూడెంలో ఇప్పటికే 20 పాజిటివ్‌లు తేలాయి. గుండాల మండలంలో నెల రోజుల వ్యవధిలో 11 మంది కన్నుమూశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోజుకు ఇరవై నుంచి నలభై పరీక్షలే చేస్తుండటంతో వైరస్‌ ఉందో లేదో తెలియక గిరిజనులు తల్లడిల్లుతున్నారు. పౌష్టికాహారం లేక ఇబ్బందిపడుతున్నారు. కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, ఆసిఫాబాద్‌ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి.

గణనీయంగా తగ్గిన నిర్ధారణ పరీక్షలు..

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ పీహెచ్‌సీలో గతంలో నిత్యం 250-300 పరీక్షలు జరగ్గా ఇప్పుడవి 40-50కి మించట్లేదు. ఆదిలాబాద్‌ జిల్లాలో రోజూ పీహెచ్​సీ స్థాయిలో 35, సీహెచ్‌సీ స్థాయిలో 50 పరీక్షలే చేస్తున్నారు. గాదిగూడ, ఝరిలలో 10 రోజులుగా పరీక్షలు జరగట్లేదు. సంగారెడ్డి జిల్లాలో అత్యధిక పీహెచ్‌సీల్లో 20లోపే పరీక్షలు చేస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో మే తొలి వారంలో 11,423 పరీక్షలు చేయగా... రెండో వారంలో ఆ సంఖ్య 8,921కి తగ్గింది.

ఏప్రిల్‌ మూడో వారం నుంచి రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య తగ్గింది. ముంబయి, దిల్లీలో లాక్‌డౌన్‌తో.. అక్కడి నుంచి కొవిడ్‌ కిట్లు తక్కువగా వస్తుండటం ఇందుకు కారణమని తెలుస్తోంది.

ఇవీచూడండి:లైవ్​ వీడియో: మిత్రుని ప్రాణాలు తీసిన బైకర్​ దుస్సాహసం

ABOUT THE AUTHOR

...view details