రాష్ట్రమంతటా మున్సిపల్ ఎన్నికల కోలాహలం నెలకొంటే... 33వ జిల్లాగా మారిన ములుగులో మాత్రం ఎలాంటి సందడి లేక బోసిపోయింది. వరంగల్ గ్రామీణ, భూపాలపల్లి, జనగామ, మహబూబూబాద్ జిల్లాలో నేతలు పురపోరుకు సన్నద్ధమవుతూ ఉత్సాహంగా ఉంటే... ములుగు నాయకులు మాత్రం డీలాపడ్డారు. జిల్లాలోని వర్ధన్నపేట, మరిపెడ, తొర్రూరు వంటి చిన్న పట్టణాలు కూడా మున్సిపాలిటీలుగా మారి... అన్ని అర్హతలున్నా ములుగుకు మాత్రం ఆ భాగ్యం దక్కలేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యమేనా...?
లక్నవరం, బొగత లాంటి పర్యాటక ప్రాంతాలకు నెలవు ములుగు జిల్లా. వరంగల్‌కు వచ్చిన పర్యాటకుల్లో అధికశాతం ఇక్కడికి వస్తారు. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన సమ్మక్క, సారలమ్మ జాతరకు కోటిన్నరకుపైగా భక్తులు ములుగుకు వస్తారు. రవాణా సదుపాయాలు మెండుగా ఉన్నాయి. ఏడాది క్రితమే భూపాలపల్లి నుంచి విడివడి... జిల్లాగా అవతరించిన ములుగులో గిరిజన విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాలని నిర్ణయించి... కార్యాచరణ కూడా చేపట్టారు. ఇన్ని ప్రత్యేకతలున్నా... ములుగుకు మున్సిపాలిటి హోదా దక్కకపోవడంపై అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.