దండకారణ్యం షెల్టర్ జోన్‌గా కార్యకలాపాలను కొనసాగించిన మావోయిస్టులు ఈ ప్రాంతంలో ఉనికిని కోల్పోయారు. అడవులపై నిశిత శోధన చేపట్టిన పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధాలు, ఎన్‌కౌంటర్లకు పాల్పడుతుండటంతో దళాల కదలికలు కొన్నేళ్లుగా తుడిచిపెట్టుకుపోయాయి. మళ్లీ పట్టును సాధించేందుకు కొంతకాలంగా నక్సల్స్ అడపాదడపా బ్యానర్లు కట్టడం, కరపత్రాలను వెదజల్లడం చేస్తున్నారు. ఇటీవల కాలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్‌కౌంటర్లు చోటుచేసుకుని పలువురు నక్సల్స్ హతమయ్యారు. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న మావోయిస్టులు హఠాత్తుగా కఠిన నిర్ణయం తీసుకున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
అత్యున్నత సమీక్ష జరిగిన వారం వ్యవధిలోనే..
మావోయిస్టుల కట్టడికి పోలీసులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా అడవులపై ముప్పేట దాడి చేపట్టేందుకు గాను ఈ నెల 4వ తేదీన రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి, కేంద్ర హోంశాఖ సలహాదారు విజయ్‌కుమార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఐజీ సుందర్‌రాజ్ వెంకటాపురం పోలీస్ సర్కిల్‌లో పర్యటించారు. మావోయిస్టులపై పట్టు సాధించేందుకు గాను క్షేత్రస్థాయి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉన్నత స్థాయి సమీక్ష జరిపిన వారం వ్యవధిలోనే మావోయిస్టులు ఒకరిని హత్య చేయడం కలకలం రేపింది. కవ్వింపు చర్యల్లో భాగంగానే ఈ తరహా ఘాతుకానికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వినిపిస్తున్నాయి.
ఆరేళ్ల అనంతరం మళ్లీ..
మన్యంలో మావోయిస్టులు సరిగ్గా ఆరేళ్ల అనంతరం ఘాతుకానికి మళ్లీ పాల్పడ్డారు. 2014 అక్టోబర్‌లో వెంకటాపురం మండలం రామచంద్రాపురం సమీపంలో గిరిజనుడు మిడెం బాలకృష్ణను పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో హత్య చేశారు. ఆ తదుపరి ఈ ప్రాంతంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగలేదు. ఏళ్లుగా పోలీసులను లక్ష్యంగా చేసుకుని మందుపాతరలు అమర్చడం, ఉనికి కోసం బ్యానర్లు కట్టి అక్కడ విధ్వంసాలకు వ్యూహాలు పన్నడం చేశారు. ప్రస్తుత ఈ ఘటనతో మళ్లీ ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో అనే భయాందోళనలు నెలకొన్నాయి.
గతంలో చోటుచేసుకున్న ఘటనలు..
2003-2014
వెంకటాపురం మండలంలో పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో దాదాపు 8 మందిని మావోయిస్టులు హత్య చేశారు. వాజేడు మండలంలో దశాబ్దాల కాలం వ్యవధిలో మొరుమూరు, దూళాపురం, పేరూరులో ముగ్గురిని చంపారు.
2017-18
వెంకటాపురం మండలం ఆలుబాక, పాలెంవాగు మధ్యతరహా జలాశయానికి వెళ్లే మార్గంలో పోలీసులు, ప్రముఖులను లక్ష్యంగా ఏర్పాటు చేసిన మందు పాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారు.
1-12-2010
కన్నాయిగూడెం మండలం దేవాదులలో ఆర్టీసీ బస్సును దహనం చేశారు. లక్ష్మీపురం, తుపాకులగూడెం గ్రామాల్లో ముగ్గురిని అపహరించారు. అప్పటి తెదేపా ఉపాధ్యక్షుడు మాజిద్‌ను హత్య చేశారు.