President Draupadi Murmu In Ramappa Temple: శీతాకాల విడిది కోసం రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము... భదాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో పర్యటించారు. తొలుత భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారిని ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు.. రాష్ట్రపతికి స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలో సీతారాముల వారికి... రాష్ట్రపతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చి... స్వామివారి తీర్ధ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో 'ప్రసాద్' పథకం శిలాఫలకాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు.
రాములవారి దర్శనం అనంతరం భద్రాచలంలో నిర్వహించిన సమ్మక్క, సారలమ్మ పూజారుల సమ్మేళనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. కుమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో ఏకలవ్య ఆదర్శ పాఠశాలలను వేదికపై నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము... తెలుగులో మాట్లాడి.. ఆకట్టుకున్నారు. తెలంగాణ పర్యటన తన జీవితంలో... గొప్ప జ్ఞాపకంగా నిలిచిపోతుందన్నారు. ఏకలవ్య పాఠశాలలు గిరిజన విద్యార్థుల అభివృద్ధికి దోహదం చేస్తామని ద్రౌపది ముర్ము విశ్వాసం వ్యక్తంచేశారు.
''రాష్ట్రపతిగా తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి పర్యటిస్తున్నాను. ప్రసిద్ధ తెలుగు కవి దాశరథి కృష్ణమాచార్య 'తెలంగాణ కోటి రతనాల వీణ' అన్నారు. అన్ని రంగాల్లో మహిళలు క్రీయాశీలకంగా పాత్ర ... దేశ సమగ్ర వికాసానికి అవసరం. కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఆదివాసీలు, వంచితులు, దిగువ తరగతి వర్గాల విద్యార్థులు చదువుకోవడానికి అనేక ఏకలవ్య ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేయడం ప్రశంసనీయమైది. ఇతర రాష్ట్రాల్లోనూ ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటు చేసే అవకాశం నాకు లభించింది. భారత దేశ నిర్మాణంలో ఈ పాఠశాలలు కీలక పాత్ర పోషిస్తాయని నా విశ్వాసం. ఏకలవ్య పాఠశాల్ల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం గిరిజన విద్యార్థుల వెంట ఉంది. విద్యార్థులు తమ స్వశక్తిపై నిలబడితే... వారి కుటుంబాలు బాగుపడతాయి. అప్పుడు సమాజం, దేశం కూడా ప్రగతి సాధిస్తాయి''. -ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి