Eight People Died Due To Floods In Mulugu :భారీ వర్షాలు, వరదలకు ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయ్‌లో అంతులేని విషాదం మిగిల్చింది. జంపన్నవాగు వరద ఉద్ధృతి గ్రామాన్ని ముంచెత్తగా ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెడుతూ.. ఆ క్రమంలోనే 8 మంది జలసమాధయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మృతదేహాల ఆచూకీ కనుగొని బంధువులకు అప్పగించారు.
Kondai Villagers Died Mulugu Floods 2023 : వర్షాలు, వరదలుకొండాయ్గ్రామస్థులకు కొత్తేం కాదు. గతంలో ఎన్నోసార్లు వరదలు గ్రామాన్ని చుట్టిముట్టినా ఈసారి మాత్రం తీరని విషాదాన్ని మిగిల్చాయి. వరద పెద్దగా రాదని తొలుత భావించిన గ్రామస్థులు.. అనంతరం వాగు ఉద్ధృతి చూసి ఆందోళనకు గురయ్యారు. గ్రామాన్ని ముంచెత్తుతుందని భయపడి ప్రాణాలు కాపాడుకునేందుకు తలోదిక్కుకు పరిగెత్తారు. కొందరు మాల్యాల, గోవిందరాజుల గ్రామాల వైపు వెళ్లారు. మరికొందరు స్థానిక ఆశ్రమం, పాఠశాల భవనం, గ్రామ పంచాయతీ భవనాలెక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. కొండాయ్, మాల్యాల గ్రామాల మధ్య కొత్తగా కల్వర్టు నిర్మించగా.. వరద ఉద్ధృతికి కోతకు గురైంది. దీంతో ఎనిమిది మంది రోడ్డును అనుకుని ఆ గుంతలో పడి... కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు.
Mulugu Floods 2023 :రెండు రోజులుగా బిక్కుబిక్కుమంటూ గడిపిన గిరిజనులకు.. రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ ద్వారా ఆహార ప్యాకెట్లు, నీళ్ల సీసాలు, మెడికల్ కిట్లు అందిచింది. గురువారం ఉదయం నుంచి ఇబ్బందులు పడుతున్న గ్రామస్థులకు.. శుక్రవారం ఉదయం పోలీసులు వెళ్లేవరకూ వారికి ఏమీ తినేందుకు లేవు. సాయం కోసం దీనంగా ఉండిపోవాల్సిన పరిస్ధితి నెలకొంది.