రాయదుర్గం పోలీసులు కొట్టడం వల్ల నరేశ్ అనే యువకుడు మరణించాడని వస్తున్న ఆరోపణలు అవాస్తవమని మాదాపుర్ డీసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఘటనపై మాదాపుర్ ఏసీపీ రఘునందన్‌రావు బృందంతో విచారణ చేపట్టామని వివరించారు. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించామన్న ఆయన.. ఎక్కడా పోలీసులు నరేశ్‌ను కొట్టిన దాఖలాలు లేవన్నారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు నరేశ్ తలకు బ్యాండ్ వాహనం తగిలి తీవ్ర గాయాలు కావడంతో మరణించాడన్నారు.
MADAPUR DCP: 'రాయదుర్గం పోలీసులపై వస్తున్న వార్తలు అవాస్తవం' 'రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని గచ్చిబౌలి పీజేఆర్‌నగర్‌లో ఓ వివాహ వేడుకలో ఏర్పాటు చేసిన సౌండ్ సిస్టమ్ వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని సాయి అనే వ్యక్తి రాత్రి 11:30కు డయల్ 100కు ఫోన్ చేశారు. దాంతో రాయదుర్గం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బ్యాండ్ సిబ్బందిని మందలించారు. అనంతరం బెనర్జీ అనే వ్యక్తి మళ్లీ డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో పెట్రోలింగ్ సిబ్బంది అక్కడకు వెళ్లారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో బ్యాండ్ వాహనం నడుపుతున్న గుండప్ప అనే వ్యక్తి వాహనాన్ని తీసే క్రమంలో ముందు ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొట్టాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న బ్యాండ్ యజమాని నరేశ్ తలకు ఆటో ముందుభాగంలో ఉన్న ఐరన్ కడ్డీ తగిలి పడిపోయాడు. వెంటనే లేచి పెట్రోలింగ్ వాహనం దగ్గరకి వచ్చాడు. ఉన్నట్టుండి కింద పడిపోయాడు.' అని డీసీపీ వివరించారు.
పోలీసులు నరేశ్‌ను వెంటనే గచ్చిబౌలిలోని హిమగిరి హాస్పిటల్‌కు తరలించారని డీసీపీ పేర్కొన్నారు. పరీక్షించిన వైద్యులు నరేశ్‌కు తల భాగంలో గాయం కావడం వల్ల మరణించినట్లు తెలిపారన్నారు. బ్యాండ్ వాహనం నడిపిన గుండప్ప స్టేట్మెంట్ రికార్డు చేశామని వివరించారు.
ఇదీ జరిగింది..
రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధి గచ్చిబౌలి పీజేఆర్ నగర్లో రాత్రి 11:30 గంటలకు బరాత్‌తో ఇబ్బంది పెడుతున్నారని డయల్ 100కు ఫిర్యాదు వెళ్లింది. అక్కడికి వెళ్లిన పోలీసులు బ్యాండును ఆపేయించారు. మరోసారి డయల్ 100కి కాల్ రావడంతో పోలీసులు మళ్లీ అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో బ్యాండ్ యువకులు పరుగులు తీశారు. తప్పించుకునే ప్రయత్నంలో నరేశ్ తలకు బ్యాండ్ వాహనం ముందుభాగంలో ఉన్న ఇనుప కడ్డీ తగిలి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలయ్యాయి. నరేశ్‌ను చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని హిమగిరి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
అయితే పోలీసులు దాడి చేయడం వల్లే నరేశ్, గుండప్ప, సంతోష్‌లకు గాయాలయ్యాయని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలోనే నరేశ్ ప్రాణాలు కోల్పోయాడన్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన డీసీపీ.. నరేశ్‌ను పోలీసులు కొట్టలేదని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: SUSPICIOUS DEATH: పెళ్లి బరాత్‌లో యువకుడి మృతి.. అసలేం జరిగింది?