భాజపా నేతలు ధాన్యం కొనుగోళ్ల విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో రైతుల పరిస్థితి ఏవిధంగా ఉందో తెలుసుకోవాలని హితవు పలికారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం పని చేస్తున్నారని తెలిపారు. రబీ సీజన్లో రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నామని చెప్పారు.
'రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన ఏకైక సర్కార్ తెలంగాణ'
దేశంలోనే రైతుల వద్ద అధికంగా ధాన్యం కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ విప్, బాల్క సుమన్, ధాన్యం కొనుగోళ్లు
కొవిడ్‌తో పోరాడుతూనే రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నామని బాల్క సుమన్ వివరించారు. తెలంగాణాలో రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తుంటే, భాజపా పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఉపయోగపడే పథకాలు ఉన్నాయా అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి రాష్ట్రానికి నిధులు మంజూరు చేయించాలని, వ్యాక్సిన్ పంపిణీ విషయంలో ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర భాజపా నేతలను డిమాండ్ చేశారు.