కొవిడ్ మూడోదశ (Third Wave) వస్తే ఎదుర్కొనేందుకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. అందుకోసం అదనపు ఆక్సిజన్ పడకలతో పాటు పిల్లల వైద్యానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిలో 500 పడకలున్నాయి. అందులో 230 పడకలకు ఆక్సిజన్ సదుపాయం ఉంది. వెంటిలేటర్స్ సదుపాయం ఉన్నవి 60 ఉన్నాయి. తాజాగా 200 ఆక్సిజన్ పడకల్ని అందుబాటులోకి తెచ్చారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇటీవలే వీటిని ప్రారంభించారు.
పిల్లలపై ప్రత్యేక దృష్టి...
కరోనా అనంతర రుగ్మతల్లో రోగులు బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు. అలాంటి రోగుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి, వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందించనున్నారు. థర్డ్‌వేవ్ (Third Wave)లో పిల్లలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న అంచనాల మేరకు ప్రస్తుతమున్న 60 పడకలు ప్రత్యేక వసతులు కల్పించనున్నారు. 50 బెడ్లకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించడంతో పాటు 10 వెంటిలేటర్స్ సమకూర్చడానికి సామగ్రి కొనుగోలు చేయనున్నారు. ప్రస్తుతం జనరల్ ఆసుపత్రిలో 8 మంది చిన్న పిల్లల వైద్యులు ఉండగా వారికి అదనంగా మరో ఆరుగురు వైద్యులను నియమించనున్నారు. జడ్చర్లలోనూ చిన్నపిల్లల వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో...
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రితో పాటు కల్వకుర్తి, అచ్చంపేట తదితర ప్రాంతాల్లో చిన్నారులకు కొవిడ్ సేవలను అందించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం నాగర్‌కర్నూల్ జిల్లాలో 170 ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 50 బెడ్లను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. ప్రస్తుతం చిన్న పిల్లల వైద్యులు నలుగురు ఉండగా... మరో ఇద్దరి అవసరం ఏర్పడనుంది. జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు.
వనపర్తి జిల్లాలో...