తెలంగాణ

telangana

ETV Bharat / state

వాట్సాప్ ఉందా... ఆఫీసుల చుట్టూ తిరగనవసరం లేదిక!

సోమవారం వచ్చిందనగానే ప్రజావాణి కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. వరుసల్లో వేచిచూడటం, అధికారుల కోసం పడిగాపులు పడటం లాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పని లేదు. వాట్సాప్ ఉంటే చాలు.. ఫోన్ ద్వారానే ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులు, విజ్ఞప్తులను అధికారులకు పంపొచ్చు. అవసరం అనుకుంటే వీడియో కాల్ ద్వారా అధికారులతో మాట్లాడొచ్చు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం మహబూబ్‌నగర్ జిల్లా యంత్రాంగం నేటి నుంచి ప్రతి సోమవారం ఆన్ లైన్ ప్రజావాణి నిర్వహించనుంది.

Mahabubnagar
Mahabubnagar

By

Published : Jul 21, 2020, 10:09 AM IST

ఓ వైపు కరోనా విజృభిస్తోంది. ఎక్కడికి వెళ్లాలన్నా.. ఎవరిని కలవాలన్నా... ఎవరితోనైనా దగ్గరగా నిలబడి మాట్లాడాలన్నా... జనం జంకుతున్నారు.

పోలీసులు, వైద్యులు, అధికారులు, సిబ్బంది సహా ప్రభుత్వ సేవలు అందిస్తున్న వాళ్లూ కరోనా బారిన పడుతుండటం వల్ల ప్రజలకు సేవ చేసే విషయంలో వెనకడుగు వేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ప్రజావాణి రద్దు చేయడంతో ప్రజా సమస్యల పరిష్కారం ఇబ్బందిగా మారింది.

ఈ నేపథ్యంలో ఆన్ లైన్ విధానంలో ప్రజాసమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టింది మహబూబ్‌నగర్ జిల్లా యంత్రాంగం. కలెక్టర్ వెంకట్రావు ఆదేశాల మేరకు మంగళవారం నుంచి డిజిటల్ తరహాలో ప్రజావాణి మొదలు కానుంది. సోమవారం సెలవు కావడంతో ఇవాళ్టి నుంచి ఆన్ లైన్ ప్రజావాణికి శ్రీకారం చుట్టనున్నారు.

ఫిర్యాదు కోసం నంబర్లు

ఈ విధానంలో ప్రజలు తమ సమస్యలను, విజ్ఞప్తులను, ఫిర్యాదులను వాట్సాప్ ద్వారా అధికారులకు పంపవచ్చు. దీంతో పాటు.. వీడియోకాల్ ద్వారా జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియోకాల్ మాట్లాడవచ్చు. తమ సమస్యలు వివరించి చెప్పొచ్చు.

కానీ ఈ సదుపాయం ప్రతి సోమవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుంది. నిర్దేశిత సమయంలో జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులంతా ఆన్ లైన్‌లో అందుబాటులోనే ఉంటారు. ప్రజలు తమ సమస్యలు విన్నవించేందుకు ప్రతి మండలానికి తహసీల్దార్, ఎంపీడీఓలకు ప్రత్యేక నంబర్లు కేటాయించారు.

ఇక జిల్లాలోని అన్నిశాఖల్లోనూ ఫిర్యాదుల కోసం ప్రత్యేక నంబర్లు విడుదల చేశారు. వీటిని ప్రసార మాధ్యమాలు, ప్రకటనల ద్వారా ప్రజలకు ఇప్పటికే తెలియపరిచారు. నేరుగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని భావించే వాళ్లు.. 9154463001 నంబర్ కు వాట్సప్ చేయొచ్చు.

ఎన్నో ప్రయోజనాలు

స్వయంగా విన్నవిస్తేనే పట్టించుకోని అధికారులు వాట్సాప్ సందేశాల్లో, వీడియో కాల్ ద్వారా విన్నవిస్తే పట్టించుకుంటారా అన్న సందేహాలున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ నంబర్లకు వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేకంగా రిజిస్టర్ నిర్వహించనున్నారు. సమస్య పరిష్కరించాల్సిన అధికారి ఎన్ని రోజుల్లో పరిష్కరించనున్నారో అందులో నివేదించాల్సి ఉంటుంది.

ప్రజావాణి కోసం ప్రత్యేకంగా నంబర్లు కేటాయించినందువల్ల గందరగోళానికి తావు ఉండదని భావిస్తున్నారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఆన్ లైన్‌లో ప్రజావాణి నిర్వహించక తప్పని పరిస్థితి.

కానీ ఈ విధానం వల్ల కొన్ని ప్రయోజనాలు ప్రజలకు కలగనున్నాయి. దూర ప్రాంతాల నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు తరలి రావాల్సిన అవసరం లేదు. ప్రజావాణికి హాజరయ్యే అధికారులను కలిసేందుకు గంటల తరబడి వేచిచూడటం, వరుసల్లో నిలబడటం లాంటి ఇబ్బందులు ప్రజలకు తప్పనున్నాయి. ప్రయాణ ఖర్చులు, శ్రమ రెండూ తగ్గనున్నాయి.

వీళ్ల కోసం కూడా ఆలోచించాలి

అయితే... ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండదు. ఉన్నా వాట్సాప్ వినియోగం తెలిసి ఉండకపోవచ్చు. అలాంటి వాళ్లు సమస్య ఎలా విన్నవించుకోవాలన్నది ప్రస్తుతం ఎదురవుతున్న ప్రశ్న. నిరక్షరాస్యులు, డిజిటల్ పరిజ్ఞానం తెలియని వాళ్లకు సహాయపడేలా అధికార యంత్రాంగం ఆలోచించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి:భారత్ బయో 'కొవాక్జిన్' పరీక్షలు వేగవంతం

ABOUT THE AUTHOR

...view details