1996-2000 వరకు ఎల్బీ స్టేడియంలోని శాప్ స్పోర్ట్స్ హాస్టల్‌లో సామల అశోక్‌కుమార్ (మహబూబ్‌నగర్) అథ్లెట్. 1997లో అండర్-17 విభాగంలో 800 మీటర్లు, 1500 మీటర్ల పరుగులో జాతీయ ఛాంపియన్. సరైన వసతులు, మార్గనిర్దేశనం లేకపోవడంతో ఒలింపిక్స్‌లో పాల్గొనాలన్న అతని స్వప్నం కలగానే మిగిలిపోయింది. ఎస్సై ఉద్యోగం రావడం.. సీఐగా ప్రమోషన్ పొందడంతో విధుల్లో నిమగ్నమయ్యాడు. అయితే తొమ్మిదేళ్ల క్రితం శౌర్య టెన్నిస్ మొదలుపెట్టడం అశోక్ జీవితాన్ని మార్చేసింది. రెండేళ్లు తనయుడితో పాటు తనూ టెన్నిస్ నేర్చుకున్నాడు. తను ఒలింపియన్ కావాలని కలగన్న అశోక్.. తనయుడిని ఆ స్థాయికి చేర్చాలన్న లక్ష్యంతో ఎంతో పరిశోధన చేశాడు. ఇక్కడున్న కోచ్‌లు, శిక్షణ సరిపోవని భావించిన అశోక్.. తనే కోచ్‌గా మారాడు.
సీఐ ఉద్యోగానికి రాజీనామా చేసి.. కొడుకుకి కోచ్‌గా: రాచకొండ కమిషనరేట్‌లో సీఐ ఉద్యోగానికి ఆర్నెల్లు లీవ్ పెట్టి.. 2017లో స్పెయిన్‌లోని రఫెల్ నాదల్ అకాడమీలో రూ.12 లక్షల ఖర్చుతో టెన్నిస్ మేస్ట్రే కోర్సు పూర్తి చేశాడు. ఐరోపాలోని టెన్నిస్ కోచ్‌లు ఈ కోర్సు చేస్తుంటారు. భారత్ నుంచి ఈ కోర్సు పూర్తి చేసింది అశోక్ ఒక్కడే! స్వదేశానికి తిరిగొచ్చి 2018లో సీఐ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. బార్సిలోనాలోని ఆండ్రూస్ జూమోనో క్లబ్‌లో సహాయక కోచ్‌గా ఉద్యోగం సంపాదించి.. శౌర్యతో పాటు అక్కడికి వెళ్లాడు. రెండేళ్ల పాటు అకాడమీలో పని చేస్తూనే.. శౌర్యకు శిక్షణ ఇచ్చాడు. 2020లో కొవిడ్ తీవ్రత కారణంగా భారత్‌కు తిరిగొచ్చారు. కొవిడ్ సమయంలో ఖైరతాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కళాశాల టెన్నిస్ కోర్టును లీజుకు తీసుకుని తనయుడికి శిక్షణ ఇచ్చాడు.
ప్రపంచ జూనియర్స్‌లో నంబర్‌వన్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో.. 2021లో ఉజ్బెకిస్తాన్‌లో కోచ్‌గా అవకాశం రావడంతో శౌర్యను తీసుకుని వెళ్లాడు. 2022లో సెప్టెంబరు వరకు క్రొయేషియాలో పని చేశాడు. శౌర్యతో పాటు కియారా సుదస్టుకోవాకు శిక్షణ ఇచ్చాడు. ప్రస్తుతం ఆమె ఐటీఎఫ్ జూనియర్స్‌లో టాప్-100 ర్యాంకింగ్స్‌లో ఉంది. నిరుడు సెప్టెంబరులో భారత్‌కు తిరిగొచ్చిన అశోక్.. నాలుగు నెలల్లో శౌర్యను జాతీయ ఛాంపియన్ చేశాడు. సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు 10 జాతీయ టోర్నీల్లో శౌర్య ఆరింట్లో గెలిచాడు. మూడింట్లో రన్నరప్‌గా నిలిచాడు. మూడు ఆసియా టోర్నీల్లో రెండింట్లో నెగ్గి.. ఒకదాంట్లో రన్నరప్ ట్రోఫీ అందుకున్నాడు. రెండేళ్లలో శౌర్యను ప్రపంచ జూనియర్స్‌లో నంబర్‌వన్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో వచ్చే వారం సెర్బియాకు పయనమవుతున్నారు.