Electricity Problems for Yasangi: ఉమ్మడి పాలమూరు జిల్లాలో యాసంగి పంటల సాగు ఊపందుకుంది. ఆరుతడి, పప్పు, నూనె గింజల సాగుకు రైతులు ప్రాధాన్యమివ్వాలని వ్యవసాయశాఖ సూచించినా, భూగర్భజల వనరులు పుష్కలంగా ఉండటంతో చాలా వరకు వరి వైపే రైతులు మొగ్గు చూపారు. ఉమ్మడి జిల్లాలో ఆరున్నల లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే, అందులో 4లక్షల ఎకరాల్లో రైతులు వరినే ఎంచుకున్నారు.
గతంలో 24 గంటలు వ్యవసాయానికి కరెంట్ ఇచ్చిన విద్యుత్ సంస్థలు ప్రస్తుతం 12 నుంచి 14 గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నాయి. ఈ కారణంగా సాగుకు నీరందడంలో రైతుకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉమ్మడి జిల్లాలో ఐదున్నర లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగింటి వరకు మళ్లీ రాత్రి 10 గంటల నుంచి తెల్లావారుజామున ఐదింటి వరకు ప్రస్తుతం సాగుకి త్రీఫేజ్ కరెంటు సరఫరా అవుతోంది.
పంటలకు నీరందడం లేదు: కరెంటు వేళల్లో స్పష్టత లేకపోవడం, తరచూ కోతల కారణంగా అనుకున్న స్థాయిలో పంటలకు నీరందడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇచ్చే కరెంటు చాలడం లేదని కొందరు చెబుతుంటే.. 14 గంటలు చాలని ఇంకొందరు అభిప్రాయడుతున్నారు. నిరంతర విద్యుత్ సరఫరా వల్ల భూగర్భజలాల అడుగుంటుతున్నాయని ఆందోళన చెందుతున్నారు.