తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడి పాలమూరులో కలెక్టరేట్ల నిర్మాణం ఆలస్యం

ఉమ్మడి జిల్లాలను వేరుచేసి నూతన జిల్లాలను ఏర్పాటు చేసినప్పటికీ... జిల్లా పరిపాలనా భవన నిర్మాణాలను మాత్రం ఇప్పటికీ పూర్తి చేయలేదు. కలెక్టరేట్ కోసం స్థలం ఎంపిక, భూ సేకరణ, భూముల అప్పగింత, టెండర్ల ప్రక్రియలో జాప్యం కారణంగా పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ఫలితంగా జిల్లా పాలనా భవనాల నిర్మాణం నత్తనడకన సాగుతున్నది.

స్థలం ఎంపిక, భూ సేకరణ, టెండర్ల ప్రక్రియలో జాప్యమే ప్రధాన కారణం

By

Published : Jul 4, 2019, 8:35 PM IST

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని కొత్త జిల్లాల్లో నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు నత్త నడకన సాగుతున్నాయి. 2017 దసరా పండగ రోజున శంకుస్థాపనలు చేసినప్పటికీ..నిర్మాణ పనులు నేటికీ పూర్తి కాలేదు. స్థలం ఎంపిక, భూ సేకరణ, భూముల అప్పగింత, టెండర్ల ప్రక్రియలో జాప్యం కారణంగా పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి.

పాలమూరు జిల్లాలో సెప్టెంబర్ నాటికి పూర్తి

మహబూబ్‌నగర్‌ జిల్లా పాలకొండ గ్రామ శివారులో 32 కోట్ల వ్యయంతో భవన నిర్మాణాలు చేపట్టారు. 23 ఎకరాల స్థలంలో సమీకృత భవన సముదాయ నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. స్థలం ఎంపిక, భూ సేకరణ కాకపోవడం వల్ల నిర్మాణ పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ నాటికి భవనాల నిర్మాణాలను పూర్తి చేస్తామని అధికారులంటున్నారు.

జోగులాంబ జిల్లాలో 2020 నాటికి పూర్తి

గద్వాల జిల్లా కేంద్రంలో నూతనంగా సమీకృత భవన సముదాయం నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రతిపాదనలు సిద్ధం చేసిన తర్వాత టెండర్ల ప్రక్రియ ఆలస్యం కారణంగా దాదాపు పది నెలల కాలం వృథా అయింది. టెండర్లు పూర్తయినా నిర్మాణ ఆకృతులు రావటం ఆలస్యం కావడం వల్ల మరో ఐదు నెలలు కాలయాపన జరిగింది. బిల్లులు సకాలంలో రాకపోవడం వల్ల పనులు ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. 2020 ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.

నాగర్​ కర్నూల్​ జిల్లాలో మరింత ఆలస్యం

నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రానికి సమీపంలోని దేశీ ఇటిక్యాల వద్ద నిర్మాణమవుతున్న సమీకృత భవన సముదాయ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. 34 కోట్ల రూపాయల వ్యయంతో 30 ఎకరాల్లో భవనాలను నిర్మించాల్సి ఉంది. 2018 డిసెంబర్ నాటికే పనులు పూర్తి కావాల్సి ఉన్నా.. మరో ఏడాదైనా పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

వనపర్తి జిల్లాలో అక్టోబర్ నాటికి పూర్తయ్యే అవకాశం

వనపర్తి జిల్లాలో నిర్మించనున్న సమీకృత భవనం నిర్మాణ పనులకు 2018 ముగిసే నాటికే పూర్తి కావాల్సి ఉంది. జిల్లా కేంద్రం సమీపంలో మర్రికుంట వద్ద 32 కోట్ల వ్యయంతో 23 ఎకరాల్లో చేపట్టిన భవన నిర్మాణాలకు మరో ఆరు నెలలు సమయం పట్టేలా ఉంది. 2019 అక్టోబర్ నాటికి భవన నిర్మాణాలు పూర్తయ్యే అవకాశాలున్నాయి.

నారాయణపేటలో భూ ఎంపిక జరగలేదు

నూతనంగా ఏర్పడిన నారాయణ పేట జిల్లాలో మాత్రం ఇప్పటికీ నూతన కలెక్టరేట్ నిర్మాణానికి కనీసం భూ ఎంపిక కూడా జరగలేదు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములు కలెక్టరేట్​కు అనువుగా ఉన్నాయా లేదా అని పరిశీలిస్తున్నారు. స్థలం ఎంపిక, భూ సేకరణ పూర్తైతే నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. వచ్చే దసరా నాటికి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయాలని అధికారులు భావిస్తున్నారు.

నత్తనడకన సాగుతున్న పాలనా భవనాల నిర్మాణం

ఇవీ చూడండి : గోల్కొండ కోటలో ఘనంగా బోనాలు

ABOUT THE AUTHOR

...view details