ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 700 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 28 మంది మృత్యువాతపడ్డారు. ఉమ్మడి జిల్లాలో శుక్రవారం 76 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున ముగ్గురు మరణించారు.
నాగర్‌కర్నూల్‌లో 40, నారాయణపేటలో 19, మహబూబ్‌నగర్‌లో 12, వనపర్తిలో 3, జోగులాంబ గద్వాల జిల్లాలో మరో ఇద్దరు కొవిడ్ బారినపడ్డారు.
నాగర్ కర్నూలు పట్టణంలోని ఓ బ్యాంకులో పనిచేస్తున్న ఐదు మంది సిబ్బందికి, సంత బజార్ కాలనీలో నివాసముంటున్న మహిళకు, శ్రీనగర్ కాలనీలో నివాసముంటున్న ఒక వ్యక్తికి, ఇదివరకే కరోనాతో మరణించిన వ్యక్తి భార్యకు, కుమారునికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అచ్చంపేట పట్టణంలో గతంలో కరోనా సోకిన ఇద్దరు వైద్యులకు సంబంధించిన 14మంది కుటుంబ సభ్యులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పట్టణంలోని విద్యా నగర్ కాలనీ, మధుర నగర్ కాలనీలో ఒక్కొక్కరికి వైరస్ సోకినట్లు జిల్లా వైద్యాధికారి తెలిపారు.
లింగాల మండలంలోని అంబటిపల్లి గ్రామంలో ఒక ఆటో డ్రైవర్, ఆర్టీసీ డ్రైవర్‌తో పాటు మరొకరికి కరోనా సోకగా.. లింగాలకు చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. కల్వకుర్తిలో 3, తిమ్మాజీపేట- 2, నేరెళ్ల పల్లి-4, అవంచ -1, వెల్టూరు-1, పాజిటివ్ నిర్ధారణ అయిందని డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్ తెలిపారు.
నారాయణపేట జిల్లాలో 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నారాయణపేట పట్టణంలోనే 8 మందికి కరోనా నిర్ధారణ కాగా.. జాజాపూర్-3, పేరపళ్ల-1, ఉట్కూర్ -2, మద్దూర్-3, నిడ్జింతలో మరో ఇద్దరికి కరోనా నిర్ధారణ అయింది. ఇందులో ఒక హెడ్ కాన్‌స్టేబుల్ ఉన్నారు.
మహబూబ్నగర్జిల్లాలో 12 మంది కరోనా బారిన పడగా.. పట్టణంలోనే 11 మందికి వైరస్సోకింది. ఒకరు మృతి చెందారు. పట్టణంలోని మోతీనగర్, షాసాబ్‌గుట్ట, వీరన్నపేట, పద్మావతికాలనీ, టీడీగుట్ట, వెంకటేశ్వరకాలనీలో ఒక్కొక్కరూ కరోనా బారిన పడ్డారు. సుభాష్‌నగర్‌లో నలుగురికి కొవిడ్ సోకింది. దేవరకద్రలో మహళకు పాజిటివ్ వచ్చింది. మోతీనగర్‌కు చెందిన వ్యక్తి కరోనాతో మృతి చెందారు.
వనపర్తి జిల్లాలో రాయగడ్డకు చెందిన ఓ మహిళా ఈ నెల 13న కరోనా బారిన పడి హైదరాబాద్ ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందింది. వనపర్తి పట్టణంలో ఇద్దరు.. మదనాపురం మండలం కొన్నూరులో మరొకరు కరోనా బారిన పడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజ పట్టణంలో ఒకరు.. ఉండవల్లి మండలం బోంగూరులో మరొకరూ కరోనాకు గురయ్యారు.