HARISH RAO: కేంద్ర ప్రభుత్వం బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్శిటీ తదితర హామీలను తుంగలో తొక్కారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. భాజపా నేతలవి ఠూటా మాటలని అబద్దాల్లో వారికి పురస్కారాలు ఇవ్వాలన్నారు. మహబూబాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో 32 పడకల పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు, 41 పడకల జనరల్ వార్డును హరీశ్‌రావు ప్రారంభించారు. 130 పడకల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 75 ఏళ్లలో రాష్ట్రంలో 3 వైద్య కళాశాలలుంటే తెలంగాణలో ఏడేళ్లలోనే 33 వైద్య కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు. తద్వారా 5420 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు. ఈ ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని పేర్కొన్నారు.
మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిని 330 పడకల అప్ గ్రేడ్ చేస్తూ నిర్మించనున్న భవనానికి, రేడియాలజీ విభాగానికి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. 30ఎకరాల్లో 550 కోట్ల వ్యయంతో అధునాతన సౌకర్యాలతో నిర్మించనున్న మహబూబాబాద్ వైద్య కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కరెంట్ కోతలతో ఆంధ్రప్రదేశ్, దిల్లీ తదితర రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఒక్క తెలంగాణలో మాత్రమే 24 గంటలు కరెంట్ అందిస్తున్నామని మంత్రి అన్నారు. తెరాసనే ఎప్పటికైనా రాష్ట్ర ప్రజలకు శ్రీరామరక్షగా నిలుస్తుందని చెప్పారు.
కేసీఆర్ వచ్చిన తరువాతే మానుకోటలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం అందుతోందని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. వరంగల్ తరహాలోనే మహబూబాబాద్‌కి అధునాతన వసతులతో వైద్య కళాశాల రాబోతోందని సత్యవతి రాథోడ్ ఆనందం వ్యక్తం చేశారు.