'బరితెగించి బజారున పడి దోచుకుంటున్నారు' అటవీశాఖకు చెందిన కోట్లాది రూపాయల భూములను తెరాస నాయకులు దొంగ డాక్యుమెంట్లతో స్వాహా చేసే ప్రయత్నం చేస్తున్నా అటవీశాఖ అధికారులు చూస్తూ ఊరుకున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. పోడు భూముల్లో రైతుల చేతికి అంది వచ్చిన పంటలను హరితహారం పేరుతో నాశనం చేస్తున్నారని అన్నారు.
మహబూబాద్ జిల్లా గూడూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రైతులను లక్షాధికారులను చేయడమే లక్ష్యం అంటూ బిక్షాధికారులుగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత పంట నష్టపోయిన రైతులకు సర్వేలు, అంచనాలతో కాలయాపన చేశారే తప్ప.. నష్టపరిహారం చెల్లించిన దాఖలాలు లేవని విమర్శించారు. నష్టపోయిన రైతులను మంత్రులు గానీ, ముఖ్యమంత్రి గానీ ఎక్కడా పరామర్శించిన దాఖలాలు లేవన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమం కేంద్ర నిధులతోనేనని.. కానీ ఎక్కడా ప్రధాని నరేంద్రమోదీ ఫొటో కనపడదని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం వాటా లేని సంక్షేమ పథకం లేనేలేదన్నారు. కొవిడ్ కష్ట కాలంలో దేశంలోని ప్రజలను ఆదుకునేందుకు కేంద్రం వేల కోట్ల రూపాయలు విడుదల చేసిందని గుర్తు చేశారు.
రాష్ట్రంలో వారం రోజుల నుంచి కరోనా కేసులు.. మరణాలు పెరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానేనని తెలిపారు. 2023లో భాజపా అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించినా వారు తెరాసలోనే కలుస్తారని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు జాటోత్ హుస్సేన్ నాయక్, ప్రేమేంధర్ రెడ్డి, రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :గుట్టలకు సైతం పట్టాలిస్తున్న రెవెన్యూ అధికారులు!