తెలంగాణ

telangana

ETV Bharat / state

పడకేసిన ఏజెన్సీ దవాఖానాలు

కుమురం భీం ఆసిఫాబాద్​ ఏజెన్సీ జిల్లాల్లో సర్కారు వైద్య సేవలు అంపశయ్యపై ఉన్నాయి. ప్రాథమిక వైద్యం ప్రజలకు అందని ద్రాక్షలా మారింది. నియోజకవర్గ ప్రజల అవసరాల కోసం నెలకొల్పిన దవాఖానాలు రోగులు లేక వెలవెలబోతున్నతీరు.. వైద్యసేవలకు దర్పణం పడుతోంది. జేబులో కాసులుంటే కార్పొరేట్​ ఆస్పత్రి తలుపుతట్టడం.. లేదంటే ప్రాణాలపై ఆశలు వదిలేసి దేవుడిపై భారం వేయాల్సిన పరిస్థితి నెలకొంది.

పడకేసిన ఏజెన్సీ దవాఖానాలు

By

Published : Jul 20, 2019, 10:53 AM IST

పడకేసిన ఏజెన్సీ దవాఖానాలు

ఏజెన్సీ దవాఖానాలకు సుస్తి చేసింది

కుమురం భీం ఆసిఫాబాద్​ ఏజెన్సీల్లో ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు నెలకొల్పిన సర్కారు ఆస్పత్రులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నియోజకవర్గంలోని బెజ్జూరు, కౌటాల, సిర్పూర్​ టీ మండలాల ప్రజలకు వైద్యసేవలందించేందుకు ఏర్పాటు చేసిన ఆస్పత్రిలో సరిపడా వైద్యులు, వసతులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఏఎన్​ఎంలే వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తున్నారంటే పరిస్థితి అర్థంచేసుకోవాలి.

వైద్యులే లేరు
14 మంది వైద్యులుండాల్సిన ఈ ఆస్పత్రిలో సూపరింటెండెంట్​ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. అతను కూడా నిత్యం కాగజ్​నగర్​ నుంచి వచ్చిపోతుంటాడు. వైద్యాధికారుల నియామకంపై అధికారులు, ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్న తీరుతో దవాఖానాలు నిరుపయోగంగా మారాయి. కాసులుంటే కార్పొరేట్​ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవడం, లేదంటే దేవుడిపై భారం వేసి బతుకుతున్నారు స్థానికులు.

పెద్దాసుపత్రులకు పంపడమే పని

నియోజకవర్గంలో పెద్ద ఆసుపత్రి ఇదే అవడం వల్ల నిత్యం వందలాది మంది వస్తుంటారు. వైద్యులు లేకపోవడం వల్ల నర్సులు, ఏఎన్​ఎంలు వైద్య పరీక్షలు చేసి ఇతర పట్టణాల్లో ఆస్పత్రులకు రిఫర్​ చేస్తున్నారు. చేసేదేమీ లేక ప్రజలు కాగజ్​నగర్​కు, మంచిర్యాలకు వెళ్తున్నారు.

అవసరాలను సొమ్ముచేసుకుంటున్న ప్రైవేటు ఆస్పత్రులు
అమాయక ప్రజల అవసరాలను కార్పొరేట్​ ఆస్పత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. అందినకాడికి దోచుకుని జేబులు గుళ్ల చేస్తున్నాయి. చిన్న చిన్న జబ్బులకు కూడా వేలకు వేలు బిల్లులు వేసి ముక్కుపిండి వసూలుచేస్తున్నాయి. జబ్బు కంటే డాక్టరు బిల్లుకే ఎక్కువ భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.

నియోజకవర్గాల అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని చెప్పుకొస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల వైద్యంపై శీతకన్ను వేశారు. ఇప్పటికైనా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యంపై దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

ఇదీ చూడండి: మోదీకి అలహాబాద్ హైకోర్టు నోటీసులు

ABOUT THE AUTHOR

...view details