తెలంగాణ

telangana

ETV Bharat / state

కబ్జా కోరల్లో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు భూములు

ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సినవారే ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను కబ్జా చేశారు. వాటిల్లో యథేచ్ఛగా చేపల పెంపకం, వివిధ పంటలను సాగుచేస్తున్నారు. ఇలా వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు పరుల ఆధీనంలో ఉన్నాయి.. గతంలో చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణంలో వేమనపల్లి మండలంలో సేకరించిన భూముల్లో తవ్విన కాల్వలను ఆక్రమించుకొని చేపల చెరువులుగా మార్చారు. విలువైన భూములను అప్పగించిన సన్న, చిన్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారగా.. స్థానికంగా ఉన్న బడా రైతులు, నాయకుల పంట పడుతోంది.. ఆక్రమణకు గురైన ప్రాణహిత భూములపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

Chevella Pranahitha Lands Occupied Political leaders at Kommaram bhim district
నాయకుల చేతుల్లో ప్రాణహిత భూములు

By

Published : Nov 9, 2020, 1:05 PM IST

కొమురం భీం జిల్లా కౌటాల మండల తుమ్మిడిహెట్టి వద్ద దాదాపు రూ.35 వేల కోట్లతో ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణానికి 2008లో అప్పటి ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కుమురంభీం, మంచిర్యాల జిల్లాల్లో వందలాది మంది రైతుల నుంచి సుమారు 5,021 ఎకరాల భూమిని సేకరించారు. సుమారు 71.0 కిలోమీటర్ల వరకు కాల్వల తవ్వకాలను చేపట్టారు. ఎకరాకు రూ.1.25 లక్షల వరకు చెల్లించారు.

యథేచ్ఛగా నాయకుల ఆక్రమణలు

ప్రాజెక్టు నిర్మాణం కోసం మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లి మండలం జిల్లెడ, జక్కపెల్లి, బుయ్యరం గ్రామాల్లో సుమారు 450 ఎకరాల భూములను రైతుల నుంచి సేకరించారు. వారికి పరిహారం అందించి భూములను స్వాధీనం చేసుకొని కాలువల తవ్వకాలను చేపట్టారు. ప్రాజెక్టు రీడిజైన్‌ కారణంగా పనులు శాశ్వతంగా నిలిచిపోయాయి. ఆ భూములు మాత్రం ప్రభుత్వ ఆధీనంలో ఉండగా వాటిపై బడా రైతులు, నాయకుల కన్ను పడింది. రెండేళ్లుగా వాటిని ఆక్రమించుకొని యథేచ్చగా చేపల పెంపకంతో పంటలను సాగు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఓ బడా రైతు.. తవ్విన కాలువను చేపల చెరువుగా తయారు చేసుకొని వ్యాపారం చేస్తున్నారు. మరికొందరు బడా రైతులు హద్దు అదుపు లేకుండా భూములను ఆక్రమించుకొని వరి, పత్తి, సోయా పంటలను సాగు చేస్తున్నారు. అధికారులు సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

రైతుల పరిస్థితి దయనీయం

తమ జీవనాధారమైన భూములను కోల్పోయి, సరైన పరిహారం అందని బక్కచిక్కిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. చాలామంది రైతులు తమకున్న భూముల్లో ఎక్కువ భాగాన్ని కోల్పోయారు. ఆశించిన పరిహారం రాలేదు. కాలువల ద్వారా నీళ్లు వస్తే మిగిలిన భూముల్లో సిరులు పండించవచ్చని భావించారు. పనులు అర్ధంతరంగా నిలిచిపోవడంతో నష్టపోతున్నారు. స్థానిక రైతులు అదనపు పరిహారం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

అన్నివిధాలా నష్టపోయాం

కాల్వల ద్వారా నీళ్లు వస్తాయంటే జీవనాధారమైన భూములను అప్పగించాం. పరిహారం కూడా ఆశించిన విధంగా ఇవ్వలేదు. చివరకు అన్నివిధాలా నష్టపోయాం. -అటకాపురం, రాజలింగు, భూనిర్వాసితుడు, జిల్లెడ

ఆక్రమణదారులపై కేసులు నమోదుచేశాం

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా జిల్లెడ, జక్కెపల్లి, బుయ్యారం గ్రామశివార్లలోని ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూముల్లో అక్రమంగా పంటలు సాగుచేయడం, చేపలపెంపకం చేసిన నలుగురు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఈ విషయాన్ని సంబంధితశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. -మధుసూదన్‌, తహసీల్దార్‌ వేమనపల్లి.

ఇవీచూడండి:మరికొన్ని గంటల్లో దుబ్బాక ఉపఎన్నిక ఫలితం.. తేలనున్న భవితవ్యం

ABOUT THE AUTHOR

...view details