Podu Land Issue in Telangana: రాష్ట్రంలో పోడు భూమల వివాదాలకు శాశ్వత పరిష్కారం కొనుగొని, సాగు దారులకు పట్టాలిచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. ఈ తరుణంలోనే గిరిజనులు, అటవీ శాఖ అధికారుల మధ్య ఘర్షణలు పెరుగుతున్నాయి. ఎండనకా, వాననకా అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణ కోసం శ్రమిస్తున్న అధికారులు పోడు రైతుల చేతుల్లో దాడులకు గురవుతున్నారు. రాష్ట్రమంతా ఏజెన్సీలు, మైదాన ప్రాంతాల్లోని పోడు భూముల్లో చెదురుమదురు ఘర్షణలు జరుగుతున్నా... అప్పుడప్పుడు అవి దాడులు, ప్రతిదాడుల స్థాయికి చేరుతున్నాయి. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ క్షేత్రాధికారి శ్రీనివాసరావు హత్యకు గురయ్యారు. పచ్చటి వనాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడే క్రమంలో తరచూ గాయాల పాలవుతున్న అటవీ సిబ్బంది, కొన్నిసార్లు అనుకోని రీతిలో ఘర్షణలు ఉద్రిక్తంగా మారుతుండటంతో ప్రాణాలు కోల్పోతున్నారు.
ఏటి కేడు పోడు సాగు విస్తీర్ణం విపరీతంగా పెరుగుతోంది... అడవుల విస్తీర్ణం తగ్గిపోతోంది. దీంతో పోడు సాగు పెరగకుండా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా 2005 తర్వాత పోడు సాగైన భూముల వివరాలు సేకరిస్తోంది. దాని ప్రకారం ఖాళీగా ఉన్న అటవీ భూముల్లో పోడు సాగును అడ్డుకుంటూ, మండలాల వారీగా వందలాది ఎకరాల్లో అటవీశాఖ మొక్కలు పెంచుతోంది. అటవీ భూములను స్వాధీనం చేసుకునేందుకు అటవీశాఖ ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి ఘటనలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నిత్యకృత్యంగా మారాయి. దీంతో పరస్పర ఘర్షణలు, వాగ్వాదాలు చోటుకుంటున్నాయి. ఆదివాసీ గిరిజనులు ఏజెన్సీల్లో పోడు భూములను నమ్ముకుని పంటలు సాగు చేసుకుంటున్నారు. వాటిని అటవీ అధికారులు గిరిజనుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిణామం సాగుదారులకు ఆగ్రహం తెప్పిస్తోంది. వివాదాలు ముదిరిన చోట పోడు రైతులు అటవీ అధికారులను నిర్బంధిస్తుంటే... అటవీశాఖ... పోడు సాగుదారులపై కేసులు నమోదు చేస్తోంది. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏళ్లుగా పోడు భూముల వివాదం రగులుతూ ఉంది.
గత కొన్నేళ్లుగా ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఘర్షణలు వెలుగుచూస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 21 మండలాల్లోనూ పోడు భూముల రగడ కొనసాగుతోంది. ఏటా సీజన్ ఆరంభంలో పోడు భూముల్లో దుక్కులు దున్నేందుకు సాగుదారులు ప్రయత్నించడం, అటవీశాఖ అధికారులు అడ్డుకోవడం పరిపాటిగా మారింది. పోడు భూముల్లో అటవీ అధికారులు మొక్కలు నాటే క్రమంలోనే ఎక్కువగా ఘర్షణలు, అల్లర్లు చోటుచేసుంటున్నాయి. అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలో ఈ ఏడాది జూన్ లో పోడుసాగుదారుల పాదయాత్రపై అధికారులు ఆంక్షలు విధించారు. కొందరిని అరెస్టు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బూర్గంపాడు మండలం లోనూ రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా 2010 నుంచి పోడు సాగుదారులు, అటవీశాఖ అధికారుల మధ్య వైరం కొనసాగుతోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో పోడు సర్వే జోరుగా సాగుతోంది. పోడు భూములకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా గ్రామం, మండలం, డివిజన్, జిల్లా వారీగా పోడు భూముల సర్వే చేపడుతున్నారు. పోడు భూముల సర్వేపై పోడు సాగుదారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ నుంచి బలవంతంగా లాక్కున్న పోడు భూముల్లో సైతం సర్వే చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ.. ఈ పద్దతి నిబంధనలకు విరుద్ధం అని అటవీశాఖ అధికారులు అంగీకరించడం లేదు. దీంతో... సాగుదారులు రగిలిపోతున్నారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 42వేల 409 ఎకరాల్లో హక్కుల కోసం 18వేల 295 మంది సాగుదారులు దరఖాస్తులు వచ్చాయి. భద్రాద్రి జిల్లాలో 2లక్షల 60వేల 474 ఎకరాల్లో పోడు హక్కుల కోసం 82వేల 621 దరఖాస్తులొచ్చాయి. ఉభయ జిల్లాల్లో ఇప్పటి వరకు దాదాపు 70శాతం పోడు సర్వే పూర్తయింది. అయితే.. ఈ సర్వేలో చాలా దరఖాస్తులు తిరస్కరణకు గురి కావడం సాగుదారుల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సుమారు లక్ష 10 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. భూపాలపల్లి జిల్లాలో 63వేల 77 ఎకరాల అటవీ భూమిని గిరిజనులు, గిరిజనేతరులు సాగు చేస్తున్నారు. ములుగు జిల్లాలో 92 వేల ఎకరాల భూమి సాగులో ఉంది. వీటికి తోడు గొత్తికోయ గిరిజన గూడాలు 74 దాకా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లాలో 34వేల 884 దరఖాస్తులొచ్చాయి. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో పోడును అడ్డుకునే క్రమంలో అధికారులపై సాగుదారులు దాడులకు తెగబడుతున్నారు. ఏడాది కాలంలో... ఇలా 16 ఘటనలు జరిగాయి. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ఐలాపురంలో పోడు జరుగుతుందని బీట్ అధికారి శ్రీనివాస్, సెక్షన్ అధికారి ప్రభాకర్‌ను పోడుదారులు కర్రలతో కొట్టారు. కుక్కలతో దాడి చేయించారు. జూన్ నెలలో తాడ్వాయి మండలం గంగారంలో అధికారులకు, గొత్తి కోయగూడెం వాసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాల వారు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు.
అడవుల్లో నివాసాలు ఏర్పాటు చేసుకొన్న గొత్తికోయలతో ఘర్షణలు, అటవీ అధికారుల ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతోంది. పోడు వ్యవసాయం, వన్య ప్రాణుల వేట జరుగుతోందని చాలాసార్లు వారిని మైదాన ప్రాంతాలకు తరలించాలని ప్రయత్నం చేసిన అధికారులు విఫలం అయ్యారు. పోడు సాగుదారులు గొడ్డళ్లు, కర్రలతో దాడులకు తెగబడుతుంటే... అటవీ అధికారులు, సిబ్బంది అడవుల్లో ఆయుధాలు లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో స్మగ్లర్లు, పోడుదారులు, వేటగాళ్ల నుంచి వీరి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. ఈ పరిస్థితుల్లో అటవీ అధికారుల ఆత్మరక్షణకు ఆయుధాలు ఇవ్వాలని, ఆర్ముడ్ రిజర్వు బలగాలను అటవీ సిబ్బందికి తోడుగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. కర్ణాటక, అసోం, మహారాష్ట్ర తరహాలో ఇక్కడా అటవీ అధికారులకు ఆయుధాలుంటే వారి ప్రాణాలకు రక్షణ ఉండేదన్న వాదన ముందుకొస్తోంది. ఈ సమస్యను త్వరగా పరిష్కరించక పోతే... మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందన్నఅభిప్రాయం వ్యక్తం అవుతోంది.