తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆగస్టు, సెప్టెంబర్​ నెలల్లో మరింతగా కరోనా విజృంభణ: ఈటల

కరోనా వైరస్​కు మనిషిని చంపే శక్తి లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల అన్నారు. అప్రమత్తంగా లేకుంటేనే ప్రాణహాని ఉంటుందన్నారు. కొవిడ్​ నియంత్రణకు ఎంతైనా ఖర్చుచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈటల స్పష్టం చేశారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రూనాట్ పరీక్షల కేంద్రం, మమత ఆస్పత్రిలో ఆర్​టీపీసీఆర్ ల్యాబ్​ను మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామ, ఎమ్మెల్యే సండ్రతో కలిసి ఈటల ప్రారంభించారు.

telangana health minister etela says that corona will never kill if attentive
ఆగస్టు, సెప్టెంబర్​ నెలల్లో మరింతగా కరోనా విజృంభణ: ఈటల

By

Published : Jul 31, 2020, 8:24 PM IST

కరోనా కట్టడి కోసం ప్రభుత్వం, వైద్య సిబ్బంది, ప్రజలు అంతా సమష్టిగా పోరాడితే కరోనా తరిమికొట్టడం ఖాయమని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. మనిషిని చంపే శక్తి వైరస్​కు లేదని.. అప్రమత్తంగా వ్యవహరించకుంటే మాత్రం ప్రాణహాని తప్పదని హెచ్చరించారు. ప్రస్తుతం పరిస్థితుల్లో ప్రజలకు ధైర్యం చెప్పేందుకు ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తుందన్నారు. కొవిడ్​ నియంత్రణకు ఎంతైనా ఖర్చు చేసేందుకైనా ముఖ్యమంత్రి కేసీఆర్​.. సిద్ధంగా ఉన్నారన్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రూనాట్ పరీక్షల కేంద్రం, మమత ఆస్పత్రిలో ఆర్​టీపీసీఆర్ ల్యాబ్​ను మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామ, ఎమ్మెల్యే సండ్రతో కలిసి మంత్రి ఈటల ప్రారంభించారు.

కేవలం ఒక్కశాతం మాత్రమే..

అనంతరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా వైద్య శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొవిడ్ సోకిన 81 శాతం మందికి వైరస్ వ్యాప్తి చెందిన విషయం తెలియడం లేదన్నారు. 14 శాతం మందికి మాత్రమే లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. కేవలం 5 శాతం మంది కరోనా బాధితులకు పరిస్థితి విషమిస్తుండగా.. ఒక్క శాతం మాత్రమే ప్రాణాలు కోల్పోతున్నారని మంత్రి ఈటల రాజేందర్​ వివరించారు. వైద్య శాఖ సిబ్బంది పూర్తిస్థాయిలో కృషిచేస్తే.. వారిని కూడా బతికించుకోవచ్చన్నారు.

రానున్న రోజుల్లో మరింత విజృంభణ..

కరోనా వైరస్ భయకరమైనదంటూ ప్రచారం జరుగుతుందన్నారు. ఫలితంగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి లక్షలు ఖర్చుచేస్తున్నారని తెలిపారు. వైరస్​ లక్షణాలు గుర్తించిన వెంటనే ఆస్పత్రికి వెళ్లే.. 99 శాతం ఎటువంటి ఇబ్బంది ఉండదని సూచించారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కరోనా మరింత విజృంభించే అవకాశం ఉన్నందున వైద్యారోగ్య శాఖ సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. సీజనల్ వ్యాధులకు తోడు కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఆశావర్కర్ నుంచి కలెక్టర్ వరకూ అంతా రాత్రింబవళ్లూ పనిచేసి ప్రజల్లో ధైర్యం నింపేందుకు కృషి చేయాలన్నారు. వైద్యశాఖలో ఖాళీలు భర్తీ చేసే నిర్ణయాధికారం జిల్లా మంత్రులు, కలెక్టర్లకు కల్పిస్తున్నట్లు మంత్రి ఈటల వెల్లడించారు. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.

ఇక నుంచి ఖమ్మంలోనే..

జిల్లాలో ట్రూనాట్ పరీక్షల కేంద్రం, ఆర్​టీపీసీఆర్ కేంద్రం అందుబాటులోకి రావడం ఫలితంగా ఒకేసారి 400 మంది కరోనా బాధితులకు అత్యవసర వైద్య సేవలు అందించే అవకాశం వచ్చిందని మంత్రి పువ్వాడ అజయ్ అభిప్రాయపడ్డారు. జిల్లాకు 3,000 ర్యాపిడ్ టెస్ట్ కిట్లు ఇచ్చారని, మరో 4 వేలు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారని పువ్వాడ చెప్పారు. ఇకపై జిల్లాలో కరోనా బాధితులు హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా.. ఇక్కడే అత్యుత్తమ వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

కలెక్టర్​కు ప్రశంసలు..

ట్రూనాడ్ పరీక్షల యంత్రం గోవా నుంచి జిల్లాకు తీసుకురావడంలో కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. సమీక్ష జరుగుతుండగానే కొంత సమయం విద్యుత్​ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. జిల్లా పరిషత్​ సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు.

పరీక్షల సంఖ్య పెంచాలి..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా కట్టడి కోసం అధికారులు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని ఎంపీ నామ నాగేశ్వరరావు కితాబిచ్చారు. వైరస్​ నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఐసోలేషన్ కేంద్రాలు, హోం ఐసోలేషన్​లో ఉన్న వారికి భరోసానిచ్చేలా వైద్య సేవలు అందించాలని సూచించారు.

సరిహద్దుల్లో పరిస్థితిని చక్కదిద్దాలి..

జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఏపీ నుంచి రాకపోకలు ఎక్కువుగా ఉన్నందునే కేసుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. పరీక్షల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశం అనంతరం మంత్రి ఈటలకు.. ఎమ్మెల్యే సండ్ర వినతి పత్రం అందించారు. సత్తుపల్లి, పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రులకు నూతన భవనాలు నిర్మించాలని కోరారు. అంబులెన్సు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఆక్సిజన్​ ప్లాంట్ కావాలి..

ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్​ ప్లాంట్ ఏర్పాటు, సిటీ స్కాన్​ సదుపాయం కల్పించాలని సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు మంత్రి ఈటలకు విజ్ఞప్తి చేశారు. కొవిడ్ వార్డుల్లో వెయిటింగ్ హాల్ ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని కోరారు. ఆయూష్ భవనం, వెల్​నెస్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు.

ఇవీచూడండి:'కరోనాకి చంపే శక్తి లేదు.. కానీ నిర్లక్ష్యం వహిస్తే మూల్యం తప్పదు'

ABOUT THE AUTHOR

...view details