నగర, పురపాలక సంస్థ ఎన్నికల పర్వం ప్రారంభం కావడంతో.. ఆయా ప్రాంతాల్లో కోలాహాలం నెలకొంది. ఖమ్మం బల్దియాలో 50 డివిజన్లు ఉండగా... పునర్విభజన తర్వాత... ఈ సంఖ్య 60కి చేరింది. ప్రస్తుతం ఉన్న 50 స్థానాల్లో... తెరాసకు చెందిన 43 మంది, ముగ్గురు కాంగ్రెస్, సీపీఎమ్, సీపీఐలకు ఇద్దరు చొప్పున సభ్యులున్నారు. వీరు ప్రాతినిథ్యం వహించిన డివిజన్లలో చాలావరకు రిజర్వేషన్లు మారిపోయాయి. పునర్విభజన కారణంగా ఇప్పటికే డివిజన్ల రూపురేఖలు మారటం, హద్దులు చెరిగిపోయి, డివిజన్ నెంబర్లు మారి సతమతమవుతున్న సిట్టింగ్‌లకు... తాజా రిజర్వేషన్లు కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. రిజర్వేషన్ మారిన చోట పోటీ కూడా విపరీతంగా ఉండటం.. సిట్టింగు కార్పొరేటర్లకు సంకటంగా మారింది. తమ స్థానంలో తమ కుటుంబ సభ్యులను బరిలోకి దింపేందుకు... తాజా మాజీలు ప్రయత్నాలు చేస్తుంటే.. రిజర్వేషన్ మారినందున... తమకు అవకాశం ఇవ్వాలని కొత్త ఆశావహులు పట్టుబడుతున్నారు.
టికెట్ కేటాయించాలంటూ..
అభ్యర్థుల అన్వేషణ పార్టీలకు సైతం తలనొప్పిగా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ అభ్యర్థుల వేట మరింత ముమ్మరం చేశాయి. ఖమ్మం తెరాసలో అయితే పరిస్థితి మరింత క్లిష్ట తరంగా మారింది. అన్ని డివిజన్లలో భారీగా ఆశావహులు ఉండటంతో... అభ్యర్థుల ఎంపికపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన డివిజన్లలో ఇప్పటికే అభ్యర్థుల జాబితా సిద్ధం చేసింది. పార్టీ హామీ మేరకు పలువురు ఇప్పటికే అంతర్గత ప్రచారం సైతం చేసుకుంటుండగా... తాజా రిజర్వేషన్లు పార్టీల నేతలకు కూడా తలనొప్పులు తెచ్చిపెట్టాయి. రిజర్వేషన్ల ఆధారంగా తమకు టికెట్ కేటాయించాలంటూ... మంత్రి పువ్వాడ అజయ్ వద్దకు డివిజన్ల వారీగా తెరాసలోని ఆశావహులు బారులు తీరుతున్నారు. కాంగ్రెస్, భాజపా సహా వామపక్షాలు సైతం అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు మరింత ముమ్మరం చేస్తున్నాయి.