Khammam BRS Public meeting : జాతీయ రాజకీయ యవనికపై సత్తా చాటడమే లక్ష్యంగా ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ బుధవారం నిర్వహించనున్న బహిరంగ సభకు 16 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ చేస్తున్నారు. తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి దాదాపు 5 లక్షల మందిని బహిరంగ సభకు సమీకరించేలా వారం నుంచి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం నూతన కలెక్టరేట్ వెనుక నిర్వహిస్తున్న ఈ సభ కోసం 100 ఎకరాలు సిద్ధం చేశారు. సభా వేదికను ఆధునిక హంగులతో ముస్తాబు చేస్తున్నారు. జర్మన్ టెక్నాలజీతో వాటర్, ఫైర్ ఫ్రూఫ్‌తో వేదికను రూపొందించారు. మొత్తం 200 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. 448 ఎకరాల్లో 20 ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు సిద్ధం చేశారు. బహిరంగ సభలో 50 ఎల్ఈడీ తెరలు, 100 మొబైల్ టాయ్‌లెట్స్ ఏర్పాటు చేశారు. 8 లక్షల మజ్జిగ సహా.. నీటి ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. వెయ్యి మంది వాలంటీర్లు సభలోని గ్యాలరీల్లో విధులు నిర్వర్తించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
BRS Public meeting in Khammam : ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు దిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్‌సింగ్ మాన్, పినరయి విజయన్‌తో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, పలువురు జాతీయ నాయకులు హాజరుకానున్నారు. జాతీయ స్థాయిలో రాజకీయాలను తనవైపు తిప్పుకునేలా కేసీఆర్ అత్యంత పగడ్బందీగా బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. దిల్లీ, పంజాబ్ సీఎంలకు ప్రొటోకాల్ ప్రకారం హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, దాసోజు శ్రవణ్ స్వాగతం పలుకుతారు.
చివరగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం..: బుధవారం ఉదయం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చిస్తారు. అక్కడే అల్పాహారం చేశాక ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు హెలికాప్టర్లలో యాదాద్రి వెళ్లి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం ఖమ్మం బయలుదేరుతారు. ఖమ్మం నూతన సమీకృత కలెక్టరేట్‌ను సీఎం ప్రారంభిస్తారు. అక్కడే కంటి వెలుగు రెండో దశ కార్యక్రమానికి లాంఛనంగా శ్రీకారం చుడతారు. అనంతరం కలెక్టరేట్‌లోనే అతిథులంతా భోజనం చేసి సభా వేదికపై ఆసీనులు కానున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సభ జరగనుంది. సభలో ముఖ్య అతిథుల తర్వాత చివరగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తారు.