తెలంగాణ

telangana

By

Published : Apr 9, 2021, 7:10 AM IST

ETV Bharat / state

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన... సఖీ కేంద్రానికి మంగమ్మ

కన్న బిడ్డల నిరాదరణతో.. ఏడు పదుల వయసులో మొండిగోడల నడుమ జీవచ్ఛవంలా బతుకీడుస్తున్న పండుటాకు కంచర్ల మంగమ్మను ఆదుకోడానికి సమాజం ముందుకు వచ్చింది. ఆమె నమ్మకాన్ని నిలబెడుతూ.. ఆ పెద్దమ్మ దీనావస్థకు డీజీపీ మహేందర్‌రెడ్డి స్పందించారు. డీజీపీ చొరవతో అధికారులు మంగమ్మను సఖీ కేంద్రానికి తరలించారు.

dgp mahender reddy helped to old woman
ఈనాడు-ఈటీవీ భారత్​ కథనానికి స్పందన

డీజీపీ స్వగ్రామమైన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురానికి చెందిన కంచర్ల మంగమ్మ దీనగాథను వివరిస్తూ శిథిల గోడల మధ్య ఓ పండుటాకు గోస... డీజీపీకి చేరేనా...? శీర్షికన ‘ఈటీవీ భారత్​లో’ గురువారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన డీజీపీ మహేందర్‌రెడ్డి ఆమెను ఆదుకోవాలని జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. స్పెషల్‌ బ్రాంచి ఏసీపీ ప్రసన్నకుమార్‌ ఉదయాన్నే కిష్టాపురంలోని ఆమె ఇంటికి వెళ్లి మాట్లాడారు. ఆమెను ఆదరించాలని అన్నం సేవా సమితికి సూచించారు. సమితి వ్యవస్థాపకుడు, పారాలీగల్‌ వాలంటీర్‌ శ్రీనివాసరావు తన బృందంతో వచ్చారు. వాలంటీర్లు ఆమెకు స్నానం చేయించి మంచి చీర కట్టారు. కూసుమంచి ఎస్‌ఐ ఇంద్రసేనారెడ్డి సహకారంతో ఆమెకు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ వృద్ధురాలికి కనీసం నిలబడే ఓపిక లేకపోవడాన్ని గుర్తించారు.

  • ‘ఈటీవీ భారత్​’ కథనాన్ని చూసిన రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ రాష్ట్ర బాధ్యులు కూడా స్పందించారు. వారి ఆదేశాలతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి మహ్మద్‌ జావిద్‌పాషా మంగమ్మ నివాసానికి వచ్చి పరామర్శించారు. ఆమె కుమారులను పిలిపించి మాట్లాడతామని, వారు సాకేలా ఒప్పిస్తామని హామీ ఇచ్చారు.
  • మహిళా, శిశు సంక్షేమశాఖ సీడీపీవో బాలా త్రిపుర సుందరి, సఖీ కేంద్రం బాధ్యులు జయంతి, అరుణ మంగమ్మ ఇంటికి వచ్చి ప్రత్యేక వాహనంలో ఆమెను తమ వెంట తీసుకెళ్లారు. అవసరమైతే తమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ‘జీవన సంధ్య’ వృద్ధాశ్రమంలో ఆశ్రయం కల్పిస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details