తెలంగాణ

telangana

ETV Bharat / state

Batti fire on Zp chairman: సీఎల్పీ నేత భట్టి, జడ్పీ ఛైర్మన్ మధ్య వాగ్వాదం...

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఖమ్మం జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్ రాజు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చెక్కులు ఆలస్యం కావడానికి కారణం బట్టి విక్రమార్కే కారణమని జడ్పీ ఛైర్మన్ విమర్శించారు. బట్టి కల్పించుకుని సభా మర్యాద పాటించాలని కమల్ రాజుకు గట్టిగా చెప్పారు. దీంతో కాంగ్రెస్, తెరాస కార్యకర్తలు ఒక్కసారిగా లేచి వాగ్వాదానికి దిగారు.

batti fire
batti fire

By

Published : Oct 29, 2021, 9:55 PM IST

ఖమ్మం జిల్లా మధిరలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఖమ్మం జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్ రాజు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఒకరిపై ఒకరు గట్టిగా అరుచుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క అధికారిక కార్యక్రమాలకు ప్రతిసారి ఆలస్యంగా వస్తున్నారని జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు ఆరోపించారు. దీనివల్ల ప్రజాప్రతినిధులు, అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. అంతేకాకుండా నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మి చెక్కులు ఆలస్యం కావటానికి కూడా బట్టి విక్రమార్క సకాలంలో సంతకాలు చేయకపోవడమేనని ఆరోపించారు.

దీంతో ఆగ్రహించిన భట్టి విక్రమార్క... ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మి చెక్కులు సీఎం పంపిణీ చేయడంలేదని అన్నారు. పరిపాలనలో బిజీగా ఉండటం వల్లే ముఖ్యమంత్రికి అది సాధ్యం కాకపోవచ్చని... ప్రతిపక్ష నేతగా తాను కూడా బిజీగా ఉన్నా సకాలంలో చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో బడ్జెట్ సమస్య వల్లే కల్యాణ లక్ష్మి చెక్కులు ఆలస్యమవుతున్నాయి తప్ప తన వల్ల కాదని తెలిపారు. దీంతో జడ్పీ ఛైర్మన్ మధ్యలో మాట్లాడుతూ అడ్డుతగలడంతో... భట్టి కల్పించుకుని సభా మర్యాద పాటించాలని చెప్పారు. దీంతో కాంగ్రెస్, తెరాస కార్యకర్తలు ఒక్కసారిగా లేచి వాగ్వాదానికి దిగారు. వెంటనే పోలీసులు ఇరు పార్టీల శ్రేణులను శాంతింపజేశారు. అనంతరం చెక్కులు పంపిణీ చేశారు.

సీఎల్పీ నేత భట్టి, జడ్పీ ఛైర్మన్ మధ్య తీవ్ర వాగ్వాదం...

ఇదీ చదవండి:Revanth Reddy: 'పేలవమైన వాదన వల్లే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిలిపేయాలని తీర్పొచ్చింది'

ABOUT THE AUTHOR

...view details