ప్రశ్న:కరీంనగర్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న తరుణంలో తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమిటి? సామాజిక సంక్రమణ జరుగుతోందా తెలుసుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
జవాబు: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు వైద్యం కోసం ఇతరత్రా అవసరాలకు వెళ్తున్నప్పుడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అలాంటి సందర్భంలో వారికి పరీక్షలు నిర్వహించి ఇంటి వద్దే చికిత్స జరిపే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. వారి ప్రైమరీ కాంటాక్టుల వివరాలు సేకరించి హోం ఐసోలేషన్‌కు పంపిస్తున్నాం. విధిగా మాస్కులు ధరించాలని.. చేతులు సానిటైజర్స్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నాం.అంతేకాకుండా సామాజిక సంక్రమణ ప్రారంభమైందా అనే విషయం తెలుసుకొనేందుకు ర్యాండ్‌గా నమూనాలు సేకరిస్తున్నాం. హుజూరాబాద్, జమ్మికుంటలలో 43మంది నమూనాలు సేకరించాం. ఎవరికి పాజిటివ్ రాలేదు. కరీంనగర్‌లోనూ నమూనాలను సేకరించాం. ఎవరైతే ప్రజల్లో ఎక్కువగా తిరుగుతున్నారో వారికి సంబంధించి నమూనాలు సేకరిస్తున్నాం.
ప్రశ్న: జిల్లాలో ఇప్పటి వరకు ఎన్నికేసులు వచ్చాయి. వారికి వైద్యం ఎలా అందిస్తున్నారు?
జవాబు:ఇండోనేషియన్లతో కలుపుకొని ఇప్పటి వరకు జిల్లాలో 56 కేసులు వచ్చాయి. ఇప్పుడు 21మంది హోం ఐసోలేషన్‌లో ఉండి వైద్యం పొందుతున్నారు. వారికి సంబంధించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎలాంటి లక్షణాలు లేని వారిని మాత్రమే హోం ఐసోలేషన్‌లో ఉంచుతూ వారికి ప్రత్యేక కిట్ అందజేస్తున్నాం. అందులో సర్జికల్ మాస్కులు, బట్టతో రూపొందించిన మాస్కులతోపాటు సానిటైజర్స్, ముందులు ఇస్తున్నాం. అంతేకాకుండా హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో సూచనలకు సంబందించిన కిట్ ఇస్తున్నాం. ఏవైనా లక్షణాలు ప్రారంభమైతే మాత్రం వారిని 108 ద్వారా జిల్లా ఆస్పత్రికి తరలిస్తున్నాం.
ప్రశ్న:హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి వైద్యసేవలు ఎలా అందిస్తారు?.. వారికి ఎవరెవరి నంబర్లు ఇస్తున్నారు?
జవాబు:హోం ఐసోలేషన్‌లో ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేని వారిని మాత్రమే ఉంచడం వల్ల వారికి కొత్తగా ఏ లక్షం ఏర్పడినా వెంటనే తమకు సమాచారం అందించేందుకు ముఖ్యమైన డాక్టర్ల నంబర్లతోపాటు 108 నంబర్ ఇస్తున్నాం. అంతేకాకుండా జిల్లా హెల్ప్‌లైన్ నంబర్ 9849902501 కూడా ఇస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో సమీపంలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వైద్యుల నంబర్లు కూడా ఇస్తున్నాం. కోమార్బిడ్ కేసులకు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నాం. ఏ లక్షణాలు లేనివారిని ఇళ్లకు పంపిస్తున్నాం. సాచురేషన్ తక్కువగా ఉండి అదనపు వైద్య సేవలు అవసరం ఉన్నవారికి మాత్రం గాంధీకి తరలిస్తున్నాం.
ప్రశ్న:ఇంతకుముందు నమూనాలు సేకరించి పరీక్షల కోసం హైదరాబాద్‌కు పంపిచే వారు కదా.. ఇప్పుడు ఎక్కడికి పంపిస్తున్నారు?ఫలితాలు ఎన్నిరోజుల్లో వస్తున్నాయి..?
జవాబు: ఇంతకు ముందు నమూనాలు సేకరించి హైదరాబాద్ పంపించే వాళ్లం కానీ ఇప్పుడు వరంగల్ పంపిస్తున్నాం. మన దగ్గర ట్రూనాట్ యంత్రం ఇప్పుడే సిద్ధమౌతోంది. ప్రారంభమయ్యేసరికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. మన జిల్లాకు వరంగల్ ల్యాబ్ కేటాయించారు.