లాక్డౌన్ దృష్ట్యా కరీంనగర్ మార్కెట్లో ఉన్న కూరగాయల దుకాణాన్ని నగర పాలక సంస్థ అధికారులు బస్టాండ్‌కు మార్చారు. బస్సు సర్వీసులు పునరుద్ధరించిన తర్వాత మార్కెట్‌ను అంబేడ్కర్ స్టేడియంకు తరలించారు. కనీస సౌకర్యాలు కల్పించకుండా.. ప్రజలకు అనుకూలంగా ఉంటుందా.. లేదా.. అని ఆలోచించకుండా అధికారులు తీసుకున్న నిర్ణయం వల్ల నగర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాత్కాలిక మార్కెట్‌తో ఇబ్బందులు
లాక్డౌన్లో నిర్మానుష్యంగా ఉన్న కరీంనగర్ బస్టాండ్‌లో పట్టణ ప్రజల సౌకర్యార్థం తాత్కాలిక మార్కెట్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం బస్సు సర్వీసులు పునరుద్ధరించిన తర్వాత తాత్కాలిక కూరగాయల మార్కెట్‌ను పట్టణంలోని అంబేడ్కర్ స్టేడియంకు తరలించారు. అక్కడికి తరలించినప్పటి నుంచి అటు కూరగాయల వ్యాపారులు, ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
చిన్నపాటి వర్షానికి కూడా తాత్కాలిక మార్కెట్ బురదమయం కావడం వల్ల కొనుగోలు దారులు, వ్యాపారులు ఇక్కట్లకు గురికాక తప్పడం లేదు. మరోవైపు.. ప్రజలకు అందుబాటులో కాకుండా.. దూరంగా ఉండడం వల్ల కూరగాయలు కొనడానికి చాలా తక్కువమంది వస్తున్నారని, నష్టపోతున్నామని కూరగాయల వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ కేంద్రానికి కాస్త దూరంగా ఉండడం వల్ల నడుచుకుంటూ వెళ్లలేకపోతున్నామని మహిళలు తెలిపారు. వాహనం లేనిదే.. మార్కెట్‌కు వెళ్లలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.
ఇదీ చదవండి:జోరుగా తాగుతున్న మందుబాబులు.. రాష్ట్రానికి కోట్లలో ఆదాయం