దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ఉత్సాహంగా, నిబద్ధతతో పని చేస్తోందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఇందుకు దళితబంధు పథకం ఓ చక్కని ఉదాహరణ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో మరో మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి లబ్ధిదారులు దాసారపు స్వరూప-రాజయ్య దంపతులు, ఎలుకపల్లి కొమురమ్మ-కనకయ్య దంపతులకు ట్రాక్టర్, ఎండిపోయిన సుగుణ-మొగిలి దంపతులకు ట్రాలీ, రాచపల్లి శంకర్‌కు మారుతీ కారును మంత్రులు అందజేశారు.
దళితబంధు పథకంలో భాగంగా లబ్ధిదారులకు వాహనాలు అందించడం అభినందనీయమని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఈ పథకానికి ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.1,500 కోట్లను విడుదల చేసిందని తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని 21 వేల దళిత కుటుంబాలు దళితబంధుతో లబ్ధి పొందనున్నాయని వివరించారు. దళితబంధు ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందుతామన్న నమ్మకం, ధైర్యం దళితుల్లో కనబడుతోందని అన్నారు.
'దళితబంధు' దశలవారీగా జరిగే కార్యక్రమం. కొద్ది నెలల్లో దళితులందరికీ ఈ పథకాన్ని అమలు చేస్తాం. ఈ పథకంతో దళిత సమాజంలో ఓ నమ్మకం, ధైర్యం కనిపిస్తున్నాయి. ఈ కార్యక్రమం 100 శాతం విజయవంతం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.- కొప్పుల ఈశ్వర్, సంక్షేమ శాఖ మంత్రి
ఇతర రాష్ట్రాలు ఈర్ష్య పడేలా..
దేశంలోని ఇతర రాష్ట్రాలు ఈర్ష్య పడేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేస్తోందని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కన్న కలలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేస్తున్నారని కొనియాడారు. నిన్నటి వరకు డ్రైవర్‌గా ఉన్న వ్యక్తి నేడు ఓ వాహన యజమానిగా.. గతంలో గుమాస్తా.. నేడు ట్రాలీ యజమానిగా మారటం దళితబంధు గొప్పతనం అన్నారు. దళితుల సంక్షేమానికి ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధును ప్రకటించడం అభినందనీయమన్నారు. దశల వారీగా దళితులందరికీ దళితబంధు పథకం అమలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.