Minister Gangula Kamalakar: మండు వేసవిలో కూడా నీరు ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. తెలంగాణ రాక ముందు కరీంనగర్లో తాగునీరు, సాగునీటికి అరిగోస పడేవాళ్లని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది తెరాస మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ ప్రాంత అభివృద్ధి చూసి వందల పరిశ్రమలు వస్తున్నాయన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌లో జరిగిన తెరాస కార్యకర్తల సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఆసిఫ్‌నగర్‌లోని పలువురు భాజపా కార్యకర్తలు ఈ సందర్భంగా తెరాస తీర్థం పుచ్చుకున్నారు.
"తెలంగాణ రాక ముందు ఈ ప్రాంత పరిస్థితి ఏమిటో మీరే చూశారు. ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకోలేదు. తాగునీరు, సాగునీటికి అరిగోస పడ్డాం. ప్రజలకు ఏమి కావాలి అని ఆనాడు ఏ ప్రభుత్వం ఆలోచించలేదు. గ్రామాలు ఆర్ధికంగా ఎదగాలని తెరాస ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. మండుటెండలో నీరు ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కింది. కరెంట్ కావాలని ఆనాడు నేనే స్వయంగా రైతులతో కలిసి ఉద్యమం చేస్తే మాపై కేసులు నమోదు చేశారు. మన ప్రాంత అభివృద్ధి చూసి వందల పరిశ్రమలు వచ్చాయి. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే ఏకైక పార్టీ తెరాస మాత్రమే. త్వరలోనే గ్రామ గ్రామాన తిరుగుతా.. మీ అందరి వద్దకు వస్తా." -గంగుల కమలాకర్, మంత్రి