తెలంగాణ

telangana

ETV Bharat / state

Huzurabad: ఎవరీ గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌... కేసీఆర్ ఆయన్నే ఎందుకు ప్రకటించారు?

హుజూరాబాద్ తెరాస అభ్యర్థిగా విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను (Gellu Srinivas Yadav) కేసీఆర్‌ (CM KCR) ఖరారు చేశారు. అనేక సామాజిక సమీకరణాలను పరిశీలించిన తర్వాత ఉస్మానియా విశ్వ విద్యాలయం కేంద్రంగా ఉద్యమంలో పాల్గొన్న గెల్లువైపే మెుగ్గు చూపారు.

gellu srinivas yadav
హుజూరాబాద్ తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌

By

Published : Aug 11, 2021, 12:33 PM IST

Updated : Aug 11, 2021, 12:40 PM IST

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ (EX- Minister Etela Rajender) రాజీనామాతో ఉపఎన్నిక అనివార్యమైన హుజూరాబాద్‌లో అభ్యర్థి కోసం అధికార తెరాస ముమ్మర కసరత్తు చేసింది. టికెట్‌ కోసం ఇటీవలే పార్టీలో చేరిన కౌశిక్ రెడ్డితో పాటు చాలామంది పేర్లను పరిశీలించారు. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఖరారు కావడంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇవ్వాలని కేసీఆర్ (CM KCR) నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే వీణవంక మండలం, హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ యాదవ్‌ను (gellu srinivas yadav) ఖరారు చేశారు.

హుజూరాబాద్ తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌

గెల్లు ప్రస్థానం..

ఎంఏ, ఎల్ఎల్​ల్బీ, రాజనీతి శాస్త్రంలో పీహెచ్​డీ చేసిన గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌... 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. శ్రీనివాస్​పై 100కు పైగా కేసులు ఉండగా.. ఉద్యమ సమయంలో పలుమార్లు పోలీసులు అరెస్టు చేశారు. రెండు సార్లు జైలుకు వెళ్లి 36 రోజులు చర్లపల్లి, చంచల్ గూడలో జైలు జీవితం గడిపారు. 2017 నుంచి టీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తెరాస అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించే ముందు అనేక పర్యాయాలు సర్వే చేయించినట్లు తెలుస్తోంది.

ముందే ప్రకటన

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలకు దీనిపై ఇప్పటికే సమాచారం ఇచ్చారు. అయితే దళిత బంధు పథకం ప్రారంభించేందుకు ఈ నెల 16న హుజూరాబాద్‌లో పర్యటించనున్న కేసీఆర్... అదే రోజు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ఉపఎన్నిక అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం జరిగినప్పటికీ అంతకు ముందే ప్రకటించారు.

అభ్యర్థులుగా పలు పేర్లు

హుజూరాబాద్‌ ఉపఎన్నికల అభ్యర్థిగా మొదట మాజీ ఎంపీ వినోద్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్, మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కుమారుడు కశ్యప్‌ రెడ్డి, ఆయన సోదరుడు ముద్దసాని పురుషోత్తంరెడ్డి, ఆయన సతీమణి ముద్దసాని మాలతి, కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరిన స్వర్గం రవితో పాటు భాజపా నుంచి చేరిన పెద్దిరెడ్డి పేర్లు వినిపించాయి. తర్వాత కౌశిక్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్, స్వర్గం రవిల పేర్లు పరిశీలన జాబితాలో ముందుకు వచ్చాయి. అయితే ఫోన్ కాల్ లీక్ వ్యవహారంతో నిర్ణయం మార్చుకుని కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ కట్టబెట్టి మరొకరికి అవకాశం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారని పార్టీ నాయకులు భావించారు. ఇందులో భాగంగానే తొలి నుంచి పార్టీతో ఉన్న నేత, ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్‌ వైపే కేసీఆర్‌ మెుగ్గు చూపారు.

బీసీ ఓట్లపై కేసీఆర్ గురి

హుజూరాబాద్ నియోజకవర్గానికే చెందిన గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌కు ఆయన సామాజిక వర్గంతో పాటు స్థానికుడు కావటం కలిసి వచ్చే అంశం కానుంది. కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఆ సామాజికవర్గం ఓట్లన్నీ తెరాసకే పడతాయని అధికార పార్టీ భావిస్తోంది. తర్వాత మెజారిటీ వర్గంగా ఉన్న బీసీ ఓట్లపై గురి పెట్టిన కేసీఆర్‌... ఈ వ్యూహంలో భాగంగానే గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు టికెట్​ ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ఉపఎన్నికపై స్పెషల్ ఫోకస్

హుజూరాబాద్‌ ఉపఎన్నిక కోసం క్షేత్రస్థాయిలో తెరాస ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. కీలక నేతలు, మంత్రులు ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రచార సరళిని పర్యవేక్షిస్తున్నారు. అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ను ప్రకటించిన దృష్ట్యా ఈ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నారు.

ఇదీ చూడండి: Huzurabad: ఎవరైతే బాగుంటుంది... హుజూరాబాద్ ఉపఎన్నికపై తెరాస కసరత్తు

Last Updated : Aug 11, 2021, 12:40 PM IST

ABOUT THE AUTHOR

...view details