కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోని ప్రభుత్వ ఆస్పత్రులకు, వైద్య సేవల కోసం మిత్రులు, బంధువుల సహకారంతో అధునాతన వైద్య పరికరాలు, అంబులెన్సులు అందించడం సంతోషంగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆయన పుట్టిన రోజు వేడుకలను కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా పార్లమెంట్ నియోజకవర్గంలోని 5 వేల మంది కార్యకర్తల కోసం తన సొంత ఖర్చులతో బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. తాను ఎంపీగా ఉన్నన్నీ రోజులు ఈ బీమా ఖర్చులు భరిస్తానని అన్నారు. సంజయ్ సురక్ష పేరుతో అంబులెన్స్‌లు అందించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ వినని, చూడని రోగాలు మనల్ని ఇబ్బందులు పెడుతున్నాయని.. అందుకే తన వంతు బాధ్యతగా కార్యకర్తలకు ఈ బీమా చేయిస్తున్నట్లు తెలిపారు.
ప్రధాని పిలుపు మేరకే..
ప్రధాని మోదీ పిలుపు మేరకు భాజపా కార్యకర్తలు తమ జన్మదినాల సందర్భంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని సూచించారు. ఇందులో భాగంగానే తనతో పాటు, సన్నిహితులు, బంధువులు ఇచ్చిన సహకారంతో ఇవన్నీ కొనుగోలు చేసి ఆస్పత్రులకు అందిస్తున్నట్లు చెప్పారు. ఐసీయూలో ఉండే సదుపాయాలన్నీ ఉండే విధంగా ఇప్పుడు నాలుగు అంబులెన్సులు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఏడు నియోజకవర్గాలకు ఏడు అంబులెన్సులు ఇస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు.
మోదీ లాక్డౌన్ ప్రకటించడం వల్లే...
కరీంగనగర్‌కు చెందిన సామాజిక కార్యకర్త లోక్‌సత్తా శ్రీనివాస్ కరోనాతో చనిపోయినప్పుడు తనకు ఈ ఆలోచన వచ్చిందని పేర్కొన్నారు. కొవిడ్ నేపథ్యంలో ప్రధాని మోదీ స్ఫూర్తిదాయకంగా పనిచేసారని ఆయన వివరించారు. కొవిడ్ మొదటి దశ సమయంలో ముందు చూపుతో ప్రధాని లాక్డౌన్ ప్రకటించడం వల్లే ప్రజలు ఆ ముప్పు నుంచి బయటపడ్డారన్నారు.