తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓ వైపు బిజినెస్​.. మరోవైపు వ్యవసాయం.. రెండిట్లో రాణిస్తున్న యువ జంట - శ్రీకాంత్​ రెడ్డి

A young couple is earning money by farming: కరోనా మనకు ఎన్నో కొత్త పాఠాల నేర్పింది. లక్షల ఉద్యోగాలకు ఎసరూ పెట్టింది. మరోవైపు వర్క్‌ ఫ్రంమ్​ హోం కారణంగా ఒకే పనికి పరిమితం కాక మరో ఆదాయ మార్గం సృష్టించవచ్చని దారి చూపింది. అదే అవకాశంగా వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించారు ఆ యువ జంట. ఇంకే ముంది ఓ వైపు కంపెనీల ప్రాజెక్టుల పనులు చేస్తునే.. మరోవైపు మంచి లాభాలతో కూడిన వ్యవసాయం చేస్తున్నారు. వారే కరీంనగర్‌కు చెందిన అనూషా, శ్రీకాంత్‌రెడ్డి దంపతులు. ఉన్న కొద్ది పొలంలోనే వినూత్న సాగుతో లక్షల్లో ఆర్జిస్తున్నారు.

A young couple making money by thinking innovatively
వినూత్నంగా ఆలోచించి డబ్బులు సంపాదిస్తున్న యువ జంట

By

Published : Mar 28, 2023, 5:21 PM IST

A young couple is earning money by farming: ఉన్నత చదువులు చదివి ఓ బిజినెస్ సొల్యూషన్స్ కంపెనీ ఏర్పాటు చేసి కెరీర్‌లో రాణిస్తున్నారు ఈ జంట. మంచి ఆదాయమూ పొందుతున్నారు. కానీ వీరి మనసంతా వ్యవసాయం పైనే. కరోనా కాలంలో మరో ఉపాధి కోసం ప్రత్యమ్నాయంగా వ్యవసాయం వైపు దృష్టి సారించారు. ఇప్పుడు అదే ప్రధానవృత్తిగా మార్చుకున్నారు. కొత్తగా ఆలోచించి లాభాలు ఇచ్చే పంటల్ని సాగు చేస్తూ ముందుకెళ్తున్నారు. వ్యవసాయం పనులు చేస్తోన్న ఈ యువ దంపతుల పేర్లు శ్రీకాంత్‌రెడ్డి, అనుషారెడ్డి. కరీంనగర్ జిల్లా జంగంపల్లి చెందిన ఓ సాధారణ కుటుంబం. ఇద్దరి కుటుంబాలది వ్యవసాయ నేపథ్యమే కావడంతో చిన్నప్పటి నుంచి మట్టిపై మమకారం పెంచుకున్నారు. అందుకే పెళ్లై కెరీర్‌ ఆలోచనలతో బిజిబిజీగా ఉన్నా.. కుటుంబంతో కలిసి ఉంటూ వ్యవసాయం చేయాలనే కోరిక ఇద్దరిలో బలంగా ఉండేది.

కరోనా వ్యవసాయానికి దగ్గర చేసింది:శ్రీకాంత్‌రెడ్డి చదువుల్లో ప్రతిభ కనబరిచి డిగ్రీపూర్తి చేయగా.. అనుషారెడ్డి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి వైకుంఠపురం అనే బిజినెస్ సొల్యూషన్స్ అంకురసంస్థ నెలకొల్పింది. హైదరాబాద్‌లో నివాసం ఉంటూ ఇద్దరు ఆ కంపెనీ వ్యవహరాలు చూసుకునే వారు. కానీ అంత బాగానే సాగుతున్న వారి ఆర్థిక పరిస్థితిపై కరోనా దెబ్బతీసింది. కరోనా ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వీరి కంపెనీకి రావల్సిన ప్రాజెక్టులు రాలేదు. దాంతో ఏం చేయాలో తోచక గ్రామంలో వీరికి ఉన్న 5 ఎకరాల్లో వ్యవసాయం చేయాలని నిర్ణయించారు. అయితే నిరంతరం వరి పంట వేయడంతో నష్టం వచ్చిందని తల్లిదండ్రులు చెబుతుండటంతో.. ఈసారి కొత్త పంట వేసి తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగారు.

ఏడు ఎకరాల్లో పూల తోటలు సాగు: వినూత్నంగా ఆలోచించి పూలసాగు వల్ల మంచి లాభాలు వస్తాయని అంచనా వేసుకున్నారు ఈ యువ జంట . పైగా వీరి చుట్టు పక్కలా ప్రాంతాల్లో ఎక్కడా పూలసాగు చేస్తున్న ఆనవాలు లేవని వారు గమనించారు. ఇంకేముంది పంట వేసి లాభాలు పొందారు. అదే ప్రేరణతో కూరగాయల పంటలు కూడా సాగుచేస్తున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి ఉండటమే కాక నచ్చిన పని చేస్తూ ఆనందంగా ఉన్నమని అనుషారెడ్డి చెబుతున్నారు. ఉన్న 5 ఎకరాలకు తోడు మరో 2 ఎకరాలు కౌలుకు తీసుకుని పూలతోటలు, కూరగాయాలు సాగు చేస్తున్నారు. కూరగాయలు,పూలకే పరిమితం కాకుండా మరింత అధ్యయనం చేశారు. ఏయే పూలకు డిమాండ్ ఉంటుందని.. ఏ మేరకు పెట్టుబడి పెడితే మంచి ఆదాయం వస్తుందని శోధించారు. అలా డిమాండ్ ఉన్నకుసుమ పంట వేసి మంచి లాభాలు ఆర్జించామని అంటున్నారు.

సొంత ఊర్లో పని ఆనందాన్ని ఇస్తుంది: కుటుంబ సభ్యులకు దూరంగా కేవలం సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌కే పరిమితం కాకుండా కరోనా మంచి ప్రత్యమ్నాయం చూపిందని.. ప్రస్తుతం వ్యవసాయంలో మంచి ఆదాయం గడిస్తున్నట్లు చెబుతున్నాడు శ్రీకాంత్ రెడ్డి. మెుదట వీరిద్దరూ వ్యవసాయం చేస్తామంటే కుటుంబీకులు వద్దన్నారు. కానీ ఎట్టకేలకు వాళ్లను ఒప్పించి సరికొత్తగా ముందుకు సాగారు. వీరి కృషికి ఫలితంగా రాజేంద్ర నగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి అవార్డు కూడా వచ్చింది. మరోవైపు తమ బిజినెస్ సొల్యూషన్స్‌కు హైదరాబాద్‌లోనే ఉండాల్సిన పని లేదని ఇక్కడి నుంచి కూడా చేయగలుగుతున్నామని ధీమాతో సొంత ఊరిలోనే ఉంటూ కెరీర్‌లో రాణిస్తున్నారు.

వ్యవసాయం , బిజినెస్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న యువ జంట

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details