జహీరాబాద్ పార్లమెంట్ 2009లో ఏర్పడింది. మొదటిసారి కాంగ్రెస్కు... రెండోసారి తెరాసకు అవకాశం కల్పించారు ఓటర్లు. ముడోసారి జరిగిన ఎన్నికల్లో జహీరాబాద్ బాద్ షా ఎవరన్నది ఆసక్తిగా మారింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు అంచనాలు వేసుకుని... గెలుపు తమదే అన్న ధీమాతో ఉన్నారు.
2009లో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో ఈ స్థానాన్ని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. తెరాస అభ్యర్థి యూసుఫ్ అలీపై స్వల్ప మెజార్టీతో సురేష్ షెట్కార్ విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో తెరాస అభ్యర్థి బీబీ పాటిల్.. సిట్టింగ్ ఎంపీ సురేష్ షెట్కార్పై లక్షా నలభై వేలకు పైగా ఓట్ల అధిక్యంతో విజయం సాధించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడింట... ఆరు స్థానాలు తెరాస కైవసం చేసుకుంది. కేవలం ఒక్క ఎల్లారెడ్డిలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అనంతర పరిణామాలతో... ఇక్కడ గెలిచిన జాజాల సురేందర్ కారెక్కారు.
సంక్షేమమే బలంగా
రెండోసారి గెలుపే లక్ష్యంగా సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బరిలో నిలిచారు. తెరాస ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు.. ఆరుగురు తెరాస ఎమ్మెల్యేలతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్ మద్దతు... స్థానికంగా బలమైన లింగాయత్ సామాజిక వర్గానికి చెందడం వంటివి... తనును గెలుపు గుర్రం ఎక్కిస్తాయన్న ధీమాతో బీబీ పాటిల్ ఉన్నారు.