తెలంగాణ

telangana

ETV Bharat / state

కృష్ణమ్మ పరవళ్లు.. ఆలమట్టికి పోటెత్తుతున్న వరద... - కృష్ణా నది వరదలు

కర్ణాటకలో భారీవర్షాలతో ఆలమట్టికి వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టు నుంచి దిగువకు నీటివిడుదలను అంతకంతకూ పెంచుతున్నారు. ఆలమట్టి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు అన్ని ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి అన్నిచోట్లా కృష్ణా నదిలో రెండు లక్షల క్యూసెక్కులపైగానే భారీ వరద ప్రవహిస్తోంది.

KRISHNA RIVER
KRISHNA RIVER

By

Published : Aug 18, 2020, 7:22 AM IST

భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. ఆలమట్టి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు అన్ని ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. అటు ఆలమట్టి ఇటు భీమా, తుంగభద్రల నుంచి వచ్చే ప్రవాహాలతో శ్రీశైలానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఇది మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎగువ నుంచి అన్నిచోట్లా నదిలో రెండు లక్షల క్యూసెక్కులపైగానే ప్రవహిస్తోంది. కర్ణాటకలో భారీవర్షాలతో ఆలమట్టికి వరద పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు నుంచి దిగువకు నీటివిడుదలను అంతకంతకూ పెంచుతున్నారు.

ఉగ్రరూపం

ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రానికి ప్రవాహం లక్ష క్యూసెక్కులు పెరిగింది. నారాయణపూర్‌ నుంచి దిగువకు 2.78లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌ జలాశయానికి దిగువన నదిలో ఉద్ధృతి పెరిగి, భారీ ప్రవాహం జూరాలకు చేరుతుండటంతో నది ఉగ్రరూపం దాల్చుతోంది. జూరాలకు సోమవారం ఉదయం 1.49లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా మధ్యాహ్నానికి 2.56లక్షల క్యూసెక్కులకు, సాయంత్రానికి 2.90 లక్షల క్యూసెక్కులకు చేరింది. ప్రాజెక్టు 39 గేట్లు తెరిచి శ్రీశైలం వైపు 2.83లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. తుంగభద్రకు ప్రవాహం పెరుగుండటంతో ప్రాజెక్టు నుంచి 47వేల క్యూసెక్కులు శ్రీశైలం వైపునకు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలానికి పెరుగుతున్న ప్రవాహం

భారీవర్షాలకు కృష్ణానదికి తోడు ఉపనదులైన భీమా, తుంగభద్రల నుంచి వస్తున్న ప్రవాహంతో శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఆదివారం సాయంత్రానికి 1.13లక్షల క్యూసెక్కులున్న ప్రవాహం సోమవారం సాయంత్రానికి 2.03లక్షల క్యూసెక్కులకు చేరింది. నాగార్జునసాగర్‌కు 40వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. సాగర్‌ దిగువన కురుస్తున్న వర్షాలకు పులిచింతల ప్రాజెక్టుకు సుమారు 13వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి 1.23 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు.

మధ్యతరహా ప్రాజెక్టులకు జలకళ

రాష్ట్రంలో మధ్య తరహా ప్రాజెక్టులు జలకళతో తొణికిసలాడుతున్నాయి. 18 జిల్లాల పరిధిలో ఇలాంటివి 36 ఉన్నాయి. వీటి కింద 4.48లక్షల ఎకరాల సాగుభూమి ఉంది. 28 ప్రాజెక్టులు నిండి అలుగు పారుతున్నాయి.

ఇదీ చదవండి:ఉగ్ర గోదావరి.. కొనసాగుతోన్న మూడో ప్రమాద హెచ్చరిక

ABOUT THE AUTHOR

...view details