రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసు వారు... బీపీ, షుగర్, గుండె, కిడ్నీ, లివర్, తదితర సంబంధిత జబ్బులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కల్గినవారు రిజిష్టర్డ్ వైద్యుని నుంచి ధ్రువీకరణపత్రం తీసుకొచ్చి వాక్సిన్ తీసుకోవచ్చని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. 60 ఏళ్ల పైబడిన వారికి వైద్యుని ధ్రువీకరణపత్రం అవసరం లేకుండా నేరుగా వాక్సిన్ వేసుకోవచ్చని పేర్కొన్నారు. రెండో విడత కరోనా వాక్సినేషన్‌పై వైద్యారోగ్య శాఖ అధికారులతో ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ముందుగా చిట్యాల సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోజుకు వంద మందికి వాక్సిన్ వేయడానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వాక్సినేషన్ చేయాలని సూచించారు. టీకా తీసుకోవాలనుకునేవారు ఆన్‌లైన్‌లో వారి పేరును కొ-విన్ అనే పోర్టల్ ద్వారా నమోదు చేసుకుని... ఆధార్ లేదా మొబైల్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. ఇందులో అనుకూలమైన తేదీ, సమయం, వాక్సినేషన్ సెంటర్‌ను ఎంపిక చేసుకోవచ్చన్నారు.