ఆర్టీసీలో కండక్టర్‌గా పని చేస్తున్న జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన మార్గం చంద్రమౌళి అప్పట్లో నలుగురు ప్రయాణికులకు టికెట్ ఇవ్వకుండా పన్నెండు రూపాయలు తీసుకున్నందుకు అధికారులు 13 ఏళ్ళపాటు ఆయనను సస్పెండ్ చేశారు.. చివరకు న్యాయస్థానాలలో గెలిచి ఉద్యోగంలో చేరిన ఆయనను విధి వక్రించింది. మూడేళ్ల సర్వీసు ఉండగానే అనారోగ్యంతో మంచాన పడి జీవచ్చవంలా మారాడు. ఇప్పుడు కుటుంబం ఆర్థికంగా చితికిపోయి దీనావస్థలో ఉందని, తాను కోల్పోయిన ఉద్యోగాన్ని తన కొడుక్కు ఇవ్వాలని న్యాయ పోరాటం చేస్తున్నాడు.
విధి వక్రించిన కుటుంబం... కోరుతోంది సాయం - జనగామ ఆర్టీసి వార్తలు
జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన ఓ కండక్టర్ దీనగాథ ఇది. 13 ఏళ్ల క్రితం తెలియక చేసిన తప్పుకు ఇప్పటికీ శిక్షను అనుభవిస్తున్నాడు. అనారోగ్యంతో మంచంపై జీవచ్చవంలా పడి ఉన్నాడు. తన ఉద్యోగం తన కొడుక్కు ఇవ్వాలని న్యాయ పోరాటం చేస్తున్నాడు.
ఈ 13 ఏళ్ల కాలంలో తమ కుటుంబం ఆర్థికంగా చితికిపోయిందని చంద్రమౌళి కొడుకు మార్గం నరేష్ అన్నాడు. తన అన్న, అక్క అనారోగ్యంతో చనిపోయారని తెలిపాడు. తన తల్లి గుండె నొప్పితో బాధ పడుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వ ఉద్యోగం ఉందనే కారణంగా రేషన్ బియ్యం కూడా ఇవ్వడం లేదని బోరున విలపించాడు. బంధువులు, గ్రామస్థుల సహకారంతో బతుకీడుస్తున్నామని తెలిపాడు. అధికారులు, ప్రజాప్రతినిధులు తమకు సహాయం చేయాలని వేడుకుంటున్నాడు.
ఇదీ చదవండి:పెద్దపులి కదలికలపై పరిశీలనలు.. నిరంతరం అప్రమత్తం!