జనగామకు సీఎం కేసీఆర్ వరాలు... అవేంటంటే..?! CM KCR Jangaon Tour Speech:
జనగామ జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్.. ఆ జిల్లాకు వరాలు కురిపించారు. జనగామకు వైద్యకళాశాల మంజూరు చేస్తామని... మూడ్రోజుల్లో జీవో జారీ చేస్తామని హామీనిచ్చారు. పాలకుర్తికి డిగ్రీ కళాశాల మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జనగామ పరిధి యశ్వంతపూర్ వద్ద ఏర్పాటు చేసిన తెరాస బహిరంగ సభలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ బహిరంగ సభకు భారీగా తెరాస శ్రేణులు, ప్రజలు తరలివచ్చారు.
వెతలు చూసి.. ఏడ్చినా...
నేడు జనగామలో పరిపాలన భవనాలు ప్రారంభించుకున్నామన్న కేసీఆర్... నాడు జనగామ ప్రజల వెతలు చూసి జయశంకర్ సార్, తాను ఏడ్చినట్లు గుర్తు చేసుకున్నారు. నాడు బచ్చన్నపేటలో సభ పెడితే ఒక్క యువకుడు కనిపించలేదని తెలిపారు. బచ్చన్నపేట సభలో అంతా వృద్ధులే కనిపించారన్నారు. బచ్చన్నపేట యువకులు వలస వెళ్లారని చెబితే కన్నీళ్లొచ్చాయని పేర్కొన్నారు.
రాష్ట్రం ఏర్పడ్డాక బచ్చన్నపేట బతుకులు మారాయి. ఇప్పుడు ఇళ్లకే మంచినీళ్లు వస్తున్నాయి. గోదావరి నీళ్లు తెచ్చి జనగామ పాదాలు కడిగే రంగం సిద్ధమైంది. ఇప్పుడు మంచినీళ్ల బాధ, విద్యుత్ బాధ పోయింది. జనగామకు వైద్యకళాశాల మంజూరు, మూడ్రోజుల్లో జీవో. పాలకుర్తికి డిగ్రీ కళాశాల మంజూరు. తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుందని ఉద్యమ వేళలోనే చెప్పా.
-- ముఖ్యమంత్రి కేసీఆర్
40 వేల కుటుంబాలకు దళితబంధు
రాష్ట్రంలో ఎస్సీల బాధలు పోవాలని కేసీఆర్ అన్నారు. ఈ ఏడాది 40 వేల కుటుంబాలకు దళితబంధు ప్రకటించారు. ప్రతి నియోజకవర్గంలో 2 వేలమందికి దళితబంధు అందించనున్నట్లు తెలిపారు. ఇవాళ మెడికల్, ఎరువులు, మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు తెచ్చామని వివరించారు.
ఇదీ చూడండి:CM KCR Jangaon Tour: వారికి ప్రత్యేక అలవెన్సులు ఇచ్చేందుకు సిద్ధం: కేసీఆర్