జగిత్యాల జిల్లా మెట్పల్లి బీడీ కాలనీకి చెందిన అల్లాడి ప్రణయ్ కుమార్ సరికొత్త ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు. ఎంటెక్ పవర్ ఎలక్ట్రానిక్స్ చదివిన ఈ యువకుడు... అందరికీ ఉపయోగపడే ఓ పరికరాన్ని తయారు చేశారు. సోలార్ వాహనాన్ని తయారు చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. స్క్రాప్ కింద పడేసిన వాహనాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి... దానికున్న ఇంజిన్ తదితర వస్తువులు తొలగించి బ్యాటరీలను అమర్చారు. అలా సోలార్ శక్తితో (Solar vehicles) వాహనం నడిచేలా తీర్చిదిద్దారు. ఈ వాహనాన్ని తయారు చేయడానికి సుమారు ఒక నెల సమయం పట్టిందని ప్రణయ్ తెలిపారు. ఈ సోలార్ వాహనాన్ని జగిత్యాల కలెక్టర్ రవి పరిశీలించి ప్రణయ్‌ను ప్రశంసించారు.
ఇంధనం అవసరం లేదు..
ప్రణయ్ తయారు చేసిన ఈ వాహనానికి హైడ్రాలిక్ సిస్టమ్‌ని కూడా ఏర్పాటు చేశారు. గంటకి 40 కిలోమీటర్ల వరకు వెళ్లే ఈ వాహనం... సుమారు 500ల కిలోల బరువును తీసుకెళ్తుందని ప్రణయ్ తెలిపారు. ఈ వాహనానికి రూ.3లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. నగరపాలక, పురపాలక, గ్రామ పంచాయతీల్లో నిత్యం చెత్త సేకరణ కోసం వినియోగించే ఇంధన వాహనాలకు బదులు సోలార్‌తో(Solar vehicles) నడిచే ఈ వాహనాన్ని వినియోగిస్తే లక్షల రూపాయలు ఆదా చేసుకోవడానికి ఎంతో ఆస్కారం ఉందని అభిప్రాయపడ్డారు.
చాలా ఉపయోగం
ఈ వాహనాలు వినియోగిస్తే... పెరుగుతున్న ఇంధన చార్జీల మోత కూడా ఉండదని తెలిపారు. కేవలం సోలార్ ప్యానల్(Solar vehicles) ద్వారా సూర్యరశ్మిని గ్రహించి బ్యాటరీ ఛార్జింగ్ చేయడం ద్వారా ఈ వాహనం నడిచేలా రూపొందించినట్లు వివరించారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు అన్నదాతలకు కూడా ఎంతో మేలు చేస్తుందని... ఎరువులు, విత్తనాలు, కూలీలను తీసుకెళ్లడానికి ఈ వాహనాన్ని తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని వాహనాలు తయారుచేస్తానని తెలిపారు.
మున్సిపల్, రైతులకు ఉపయోగపడే విధంగా ఎలక్ట్రిక్ వాహనాన్ని నేను తయారు చేశాను. అది సోలార్‌తో ఛార్జింగ్ అయ్యేలా రూప్పై సోలార్ ప్యానెల్ అమర్చి... బ్యాటరీలు ఛార్జ్ అయ్యేలా తయారుచేశా. మున్సిపల్ సిబ్బందికి ఉపయోగపడేలాగా హైడ్రాలిక్ సిస్టం కూడా పెట్టాం. ఇది 500 కిలోల బరువును మోయగలదు. 30-40 స్పీడ్ వరకు వెళ్తుంది. దీనికి రూ.3లక్షల వరకు ఖర్చు అవుతుంది.