PM Tour In Visakha: ఈనెల 12న ఏయూలో జరిగే ప్రధాని సభకు 2 లక్షల నుంచి 3 లక్షల మందిని సమీకరించేలా అధికార వైకాపా కార్యాచరణ సిద్ధం చేసింది. ఉత్తరాంధ్రలోని దాదాపు అన్ని నియోజకవర్గాలకూ బాధ్యులను నియమించింది. విశాఖ నగర పాలక సంస్థలో వైకాపా కార్పొరేటర్లకు జనసమీకరణ లక్ష్యాలను నిర్దేశించింది.
సభకు ప్రజలను తరలించేలా సన్నాహాలు:ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల నుంచి జనాలను తరలించేలా సన్నాహాలు చేస్తోంది. ఏర్పాట్లను సమన్వయం చేస్తున్న వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి.. మంత్రులు, ఎమ్మెల్యేలతో కూడిన ప్రత్యేక పర్యవేక్షక బృందాన్ని నియమించారు. వైకాపా విశాఖ ప్రాంతీయ సమన్వయకర్త, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విశాఖ నేతలతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం క్రీడా మైదానంతో పాటు ఎదురుగా ఉన్న మరో మైదానాన్నీ సిద్ధం చేయిస్తున్నారు.
ప్రధాని సభకు వైకాపా హడావుడి:జనాలను తరలించేందుకు ఆర్టీసీ, ప్రైవేటు బస్సులతోపాటు ఇతర వాహనాలను సమకూరుస్తున్నారు. ప్రధాని విశాఖ పర్యటన అధికారిక పర్యటన అయినందున రాష్ట్ర ప్రభుత్వపరంగా ఏర్పాట్లు చేస్తున్నామని వైకాపా నేతలు ప్రకటిస్తున్నారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్ వైకాపా నాయకులతో సమావేశాలు నిర్వహించి ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ప్రధాని సభకు జన సమీకరణ జరిపేందుకు వైకాపా చేస్తున్న హడావుడి రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.