AP Govt On PRC: పీఆర్సీపై ఏపీ ఉద్యోగులు మొదలు పెట్టిన ఆందోళన ఉద్ధృతమవుతోంది. ఇవాళ సింహగర్జన సభ నిర్వహించారు. ఉద్యోగుల సమస్యలపై స్పష్టత ఇవ్వాల్సిందేనని ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పీఆర్సీతో పాటు ఇతర అంశాలపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాయి. సీపీఎస్ రద్దు, పీఆర్సీలో హెచ్ఆర్ఏ సహా వివిధ అంశాలు ముడిపడి ఉన్నందున మొత్తంగా నివేదికపై చర్చించాల్సి ఉందంటున్నాయి. విజయవాడ వేదికగా 'సింహగర్జన' సభకు పలు జిల్లాల నుంచి ఉద్యోగులు భారీగా తరలి వచ్చారు. ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలని.. ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేసి పాత పింఛన్ విధానం తీసుకురావాలని నినాదాలు చేశారు.
దీనిపై ఇప్పటికే ఆర్థికశాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన సీఎం జగన్.. ఏ మేరకు పీఆర్సీ ఫిట్మెంట్ను ప్రకటించ వచ్చన్న అంశంపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. దీనిపై స్పష్టత ఇచ్చే దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పీఆర్సీ ఫిట్మెంట్ను 30-35 శాతం మధ్య ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. అయితే.. ఈ ప్రతిపాదనలపై మరోమారు ఉద్యోగ సంఘాలతో చర్చించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. 13, 14 తేదీల్లో ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు రావాల్సిందిగా సీఎస్ ద్వారా సమాచారం పంపించే అవకాశముందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పీఆర్‌సీ ప్రకటించినా ఉద్యమాన్ని విరమించేది లేదు..
సీపీఎస్ రద్దు కాకుండా ప్రత్యామ్నాయాలు అవసరం లేదని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయాలన్నారు. మొత్తంగా పెండింగ్‌లో ఉన్న 7 డీఏల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
'ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయాలి. మొత్తంగా పెండింగ్‌లో ఉన్న 7 డీఏల బకాయిలు వెంటనే విడుదల చేయాలి. ఆదర్శ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు కూడా పీఆర్‌సీ ప్రకటించాలి. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, అంగన్వాడీలకు జీతాలు పెంచాలి. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకూ వెంటనే పీఆర్‌సీ ప్రకటించాలి. పీఆర్‌సీతో పాటు నాన్ ఫైనాన్షియల్ డిమాండ్లను వెంటనే పరిష్కరించే విధంగా సీఎం జగన్ చొరవ తీసుకోవాలి. పీఆర్‌సీ ప్రకటించినా..ఉద్యమాన్ని విరమించేది లేదు. రెండో దశ ఉద్యమ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తాం. ఇప్పటివకే ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తాలూకాల్లో నిరసన ర్యాలీలు చేపడతాం. సీఎంపై ఉన్న గౌరవంతో మూడేళ్లు ఎదురుచూశాం. హామీలు నెరవేర్చే వరకూ ఉద్యమం ఆపేది లేదు. ఉద్యోగులంతా ఉద్యమానికి సహకరించాలి' -బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్