పట్టభద్రుల కోటా శాసన మండలి ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను తయారు చేసే కసరత్తు కొనసాగుతోంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్, నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత ఎమ్మెల్సీల పదవీ కాలం.. మార్చి 29, 2021 నాటికి ముగియనుంది. అప్పటిలోగా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఓటర్ల జాబితా తయారు ప్రక్రియను ప్రారంభించింది.
ఆ జాబితా ఆధారంగానే..
ఎమ్మెల్సీ ఎన్నిక కోసం డీనోవా విధానాన్ని అనుసరిస్తున్న నేపథ్యంలో పాత జాబితాతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరూ మళ్లీ ఓటు హక్కు నమోదు చేసుకోవాల్సిందే. ఈసీ ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 1 నుంచి ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 6 వరకు అవకాశం ఉంది. డిసెంబర్ 1న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురిస్తారు. ముసాయిదాపై వచ్చే అభ్యంతరాలను పరిష్కరించి 2021 జనవరి 18న తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు. ఆ జాబితా ఆధారంగానే ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో రెండు పట్టభద్రుల నియోజక వర్గాలకు ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహిస్తారు.