తెలంగాణ

telangana

By

Published : Jul 14, 2021, 9:30 AM IST

Updated : Jul 16, 2021, 5:34 PM IST

ETV Bharat / state

Good news for degree students : డిగ్రీ విద్యార్థులకు గుడ్​న్యూస్​..

రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ పరిధిలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల భర్తీకి ఉమ్మడి వడపోత పరీక్ష జరపాలంటే వర్సిటీల చట్టానికి సవరణలు అవసరమంటున్నారు ఉపకులపతులు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను క్లస్టర్లుగా విభజించి... వివిధ సదుపాయాలను విద్యార్థులు పరస్పరం వినియోగించుకునే అంశంపై కూడా చర్చించారు.

vice chancellors says Universities law needs amendments in telangana
Universities: వర్సిటీల చట్టానికి సవరణలు అవసరం!

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ(Telangana higher education) పరిధిలోని 11 విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల భర్తీకి ఉమ్మడి వడపోత పరీక్ష (స్క్రీనింగ్‌ టెస్టు) జరపాలంటే ఇప్పుడున్న విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణ అవసరమని పలువురు ఉపకులపతులు పేర్కొన్నట్లు తెలిసింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో కొందరు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం.

అన్ని వర్సిటీలకు కలిపి ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్ని వర్సిటీలకూ ఒకేసారి నియామకాలు జరపాలని, అందుకు ఉమ్మడి పరీక్ష జరపాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ ఏడాది కిందట వెల్లడించారు. ఒక్కో వర్సిటీ ఒకసారి నియామకాలు జరిపితే... ఎంపికైన వారు మళ్లీ మరోచోటకు మారిపోతారని, దానివల్ల ఖాళీలను పూర్తిస్థాయిలో భర్తీ చేయలేకపోతున్నామనేది ఆయన భావన. ఆ క్రమంలోనే కొద్దినెలల కిందటే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచన మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉన్నత విద్యామండలి అధికారులతో చర్చించారు. దీనిపై ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని, ఖాళీల సంఖ్యను బట్టి ఒక్కో పోస్టుకు ఇద్దరు లేదా ముగ్గురిని ఇంటర్వ్యూకు ఆహ్వానించాలని ప్రభుత్వానికి ఉన్నత విద్యామండలి నివేదిక ఇచ్చింది.

తాజాగా విధివిధానాలు పంపాలని ప్రభుత్వం ఆదేశించినందున కొత్తగా నియమితులైన ఉపకులపతులతో చర్చించేందుకు ఉన్నత విద్యామండలి సమావేశం ఏర్పాటు చేసింది. 1996లో ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చిన విశ్వవిద్యాలయాల చట్టం ప్రకారం విశ్వవిద్యాలయాలే బోధన సిబ్బందిని భర్తీ చేసుకోవాలి. అదే చట్టాన్ని రాష్ట్రం అనుసరించింది. అందువల్ల చట్ట సవరణ తప్పనిసరని, లేకుంటే న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయన్న చర్చ జరిగింది. చట్ట సవరణకు ఆలస్యమవుతుందనుకుంటే ఆర్డినెన్స్‌ తీసుకురావాల్సి ఉంటుందని కొందరు సూచించారు. లేకుంటే ఏపీలో మాదిరిగా ఇక్కడా అర్ధంతరంగా ప్రక్రియ ఆగిపోతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీనిపై కమిటీని నియమించి విధివిధానాలను రూపొందించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను క్లస్టర్లుగా విభజించి... వివిధ సదుపాయాలను పరస్పరం వినియోగించుకునే అంశంపై కూడా చర్చించారు. క్లస్టర్​లోని కళాశాలలు అదే పరిధిలోని ఇతర కాలేజీల్లో అధ్యాపకులు, గ్రంథాలయాలు, క్రీడా మైదానం, లేబొరేటరీలను వినియోగించుకోవడం వల్ల నాణ్యతను పెంపొందించుకోవచ్చునని అధికారులు అభిప్రాయపడ్డారు. ఉద్యోగాల భర్తీ, క్లస్టర్ విధానంపై సమావేశంలో అందిన సూచనలను ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. ఈ ప్రతిపాదన అమలు అయితే విద్యార్థులు ఏ కాలేజీలో చేరినా... తమకు నచ్చిన డిగ్రీ కళాశాలలో తరగతులకు హాజరుకావొచ్చు.

ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు ఆర్‌.లింబాద్రి, వి.వెంకటరమణ, ఉపకులపతులు కట్టా నరసింహారెడ్డి, సీతారామారావు, గోపాల్‌రెడ్డి, రవీందర్‌, మల్లేశం, తాడికొండ రమేశ్‌ పాల్గొన్నారు. అంతకు ముందు క్లస్టర్‌ విద్యావిధానంపై జరిగిన కమిటీ సమావేశంలో స్వయంప్రతిపత్తి హోదా ఉన్న కళాశాలలను బలోపేతం చేయాలని నిర్ణయించారు.

ఇదీ చూడండి: Ph.D Set: 6 వర్సిటీల్లో పీహెచ్‌డీ ప్రవేశాలకు ఇక సెట్‌!

Last Updated : Jul 16, 2021, 5:34 PM IST

ABOUT THE AUTHOR

...view details