తెలంగాణ

telangana

ETV Bharat / state

‘వందే భారత్‌’.. తొలి రోజున రైలు ఆగనున్న స్టేషన్లు ఇవే! - ఏపీలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు స్టేషన్లు

Vande Bharat express stations : సంక్రాంతి రోజున ప్రధాని మోదీ ‘వందే భారత్‌ రైలు’ను వర్చువల్‌గా ప్రారంభించనున్న విషయం తెలిసిందే. అయితే, రైలు ప్రారంభం రోజున ప్రత్యేక వేళల్లో నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. అలాగే తొలి రోజున రైలు ఆగనున్న స్టేషన్లు కూడా ప్రకటించింది.

Vande Bharat express
Vande Bharat express

By

Published : Jan 13, 2023, 6:25 PM IST

Vande Bharat express stations : తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆదివారం ప్రారంభం కానుంది. కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి కానుకగా అందిస్తున్న ఈ రైలును దిల్లీ నుంచి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్రారంభం రోజు వందే భారత్‌ రైలు ప్రత్యేక వేళల్లో నడవనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

ఆదివారం ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరిన వందే భారత్‌ రైలు చర్లపల్లి, భువనగిరి, జనగామ, ఖాజీపేట్‌, వరంగల్‌, మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుందని తెలిపారు. అదే రోజు రాత్రి 8.45 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుందని పేర్కొన్నారు.

ఉత్తరాంధ్రుల కోసం..హైదరాబాద్‌ నుంచి ఉత్తరాంధ్రకు జిల్లాలకు వెళ్లాలంటే.. రైళ్లలో ఎప్పుడూ బెర్తులు దొరకని పరిస్థితి ఉంటుంది. 4 నెలల ముందు బెర్తుల రిజర్వేషన్‌ ప్రారంభమైనా కొద్ది రోజులకే రైళ్లు నిండిపోతుంటాయి. రోజూ ప్రయాణించే 9 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు తోడు.. వారంలో 1, 2, 3 రోజులు నడిచే ప్రత్యేక రైళ్లున్నా, అన్నింటిలోనూ నిరీక్షణ జాబితా చాంతాడంత కన్పిస్తుంటుంది. ఈ తరుణంలో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రావడాన్ని నగర ప్రయాణికులు స్వాగతిస్తున్నారు.

ఆదివారం నడవదు..ప్రారంభ రోజు మినహా..మిగతా రోజుల్లో విశాఖపట్నం నుంచి ఉదయం 5.45 గంటలకు వందేభారత్‌ రైలు బయలుదేరి మధ్యాహ్నం 2.25 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. మధ్యాహ్నం 2.45 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి రాత్రి 11.25 గంటల సమయంలో విశాఖపట్నం చేరుతుందని ప్రాథమికంగా అందిన సమాచారం. వారంలో 6 రోజులే నడుస్తుంది. ఆదివారం నడవదని షెడ్యూలులో వెల్లడించారని వరంగల్‌ రైల్వే కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ స్వామి తెలిపారు.

త్వరలో ‘ట్రైన్‌ 20’ పేరుతో కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. మలుపుల వద్ద రైలు ఎంత వేగంగా వెళ్లినా ప్రమాదాలు జరగకుండా టిల్టింగ్‌ టెక్నాలజీని జోడించనున్నారు. 1.0 వెర్షన్‌ ఫీచర్లతో తయారైన ఈ రైలులో సకల సదుపాయాలను, భద్రతా సౌకర్యాలను విస్తరిస్తూ 4.0 వెర్షన్‌కు చేర్చనున్నారు. వందేభారత్‌కు ఉన్న ఆదరణ దృష్ట్యా విదేశాలు ఈ రైళ్లను దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. అయితే దేశీయ అవసరాలు తీరిన తర్వాతే ఎగుమతులు చేస్తామని రైల్వే ముఖ్య అధికారి ఒకరు తెలిపారు. ఈ రైళ్లను పరీక్షించడానికి జోధ్‌పూర్‌ డివిజన్‌లో 59 కిలోమీటర్ల ట్రాక్‌ను కూడా నిర్మిస్తున్నారు.

ఇవీ చదవండి :తొలిసారి విశాఖ చేరుకున్న ‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌’.. విశేషాలివే..

ABOUT THE AUTHOR

...view details